Hayathnagar: హయత్నగర్ లో అసంపూర్తిగా నిలిచిన డ్రైనేజీ పనుల పరిశీలన!
Hayathnagar: హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో అసంపూర్తిగా నిలిచిన డ్రైనేజీ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. తక్షణమే పనులు పూర్తి చేయాలని డిమాండ్.
Hayathnagar: హయత్నగర్ డివిజన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీ నుంచి మునుగనూర్ కల్వర్ట్ వరకు చేపట్టాల్సిన డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులు నిధులు మంజూరై దాదాపు మూడేళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ పూర్తికాకపోవడంపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ డ్రైనేజీ పనులను మూడు విడతలుగా చేపట్టాల్సి ఉండగా, మధ్యలోనే పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో లక్ష్మీప్రియ కాలనీ, దుర్గా నగర్, శివాజీ నగర్ ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న పనుల కారణంగా నిత్యం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తికాకపోవడానికి అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హయత్నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆయా కాలనీలలో పర్యటించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు.
మంజూరైన నిధులతో చేపట్టిన పనులు మూడేళ్లుగా ఎందుకు పూర్తికావడం లేదని ప్రశ్నించిన ఆయన, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పునఃప్రారంభించి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సంబంధిత కాలనీవాసులకు త్వరితగతిన సమస్య నుంచి విముక్తి కల్పించాలని కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు.
అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.




