Hayathnagar: పేదల భూములను లాక్కుంటే సహించేది లేదు ఈటల రాజేందర్
Hayathnagar: హయత్‌నగర్ పరిధిలో దళితుల ఎక్సాల్ పట్టా భూములను హౌసింగ్ బోర్డుకు కేటాయించడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ఖండించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Hayathnagar: పేదల భూములను లాక్కుంటే సహించేది లేదు ఈటల రాజేందర్
హయత్‌నగర్: అనాజ్‌మల్ (అన్మగల్) హయత్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 255లో వందల సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితుల ఎక్సాల్ పట్టా భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి వద్ద బాధితులతో కలిసి ఆయన సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములకు నష్టపరిహారం చెల్లిస్తున్న విధంగానే, గతంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములు, ఎక్సాల్ పట్టా భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం సగం భూమినైనా బాధితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పోలీసు బందోబస్తు మధ్య నిర్మించిన ప్రీకాస్ట్ గోడలను కూల్చివేస్తామని హెచ్చరించారు. పేదలు, దళితుల భూములను పోలీసుల బలగాల అండతో బలవంతంగా స్వాధీనం చేసుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితులే ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురవుతాయని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయల విలువైన భూముల విక్రయాల విషయంలో తాము అడ్డుపడటం లేదని, కానీ పేదల జీవనాధారమైన భూములను లాక్కుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలతో పెట్టుకోవద్దని, బాధితులకు న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.




