Raidurg: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం!

Raidurg: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 26 Nov 2026 5:25 PM IST
Raidurg
X

Raidurg: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం!

రాయదుర్గం: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు 'భారత రాజ్యాంగ దినోత్సవం'పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ రాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సోషియాలజీ విభాగాధిపతి ఆచార్య జి. నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆచార్య నాగరాజు మాట్లాడుతూ.. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, గతంలో ఈ రోజును 'నేషనల్ లా డే'గా జరుపుకునేవారమని గుర్తుచేశారు. అంబేద్కర్ 125వ జయంతోత్సవ సంవత్సరమైన 2015 నుండి దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 1947 ఆగస్టులో అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైందని, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి సుమారు రూ. 64 లక్షల వ్యయంతో రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు.

ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్‌జాదా ఇటాలిక్ కాలిగ్రఫీ శైలిలో ఆంగ్లం, హిందీ భాషలలో చేతివ్రాతతో రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు.

రాజ్యాంగం ఆమోదించినప్పుడు 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండగా, 106 సవరణల తర్వాత ప్రస్తుతం 470 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షలు లేకుండా పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించేలా రాజ్యాంగాన్ని నిర్మించారని పేర్కొన్నారు. సుపరిపాలన కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, 7వ షెడ్యూల్ ద్వారా కేంద్ర-రాష్ట్ర అధికారాలను విభజించి బలమైన సమాఖ్య వ్యవస్థకు పునాది వేశారని వివరించారు. అణగారిన వర్గాల రక్షణకు వివిధ జాతీయ కమిషన్లు, ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగం కల్పించిందన్నారు.

"రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది భారతీయ పౌరులందరికీ జీవన విధానం. భావి భారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండి, దానిని గౌరవించాలి" అని ఆచార్య నాగరాజు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరి చేత రాజ్యాంగ పీఠికను (ప్రియాంబుల్) చదివించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, చంద్రశేఖర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY