Abdullahpurmet: నవంబర్ 17న 48 గంటల 'గో సడక్ బంద్'

Abdullahpurmet: గో సంరక్షణ, గోవధ నిరోధక చట్టాల అమలు కోసం నవంబర్ 17న 48 గంటల పాటు విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తూ 'గో సడక్ బంద్' నిర్వహించనున్నట్లు శివకుమార్ వెల్లడించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 18 Oct 2026 5:14 PM IST
Abdullahpurmet
X

Abdullahpurmet: నవంబర్ 17న 48 గంటల 'గో సడక్ బంద్'

అబ్దుల్లాపూర్మెట్: గోమాత రక్షణ, గోవధ నిరోధక చట్టాల సమర్థవంతమైన అమలు కోసం నవంబర్ 17న ‘గో సడక్ బంద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యుగతులసి ఫౌండేషన్ అధినేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కే. శివకుమార్ ప్రకటించారు. గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 48 గంటల పాటు విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ‘గో సడక్ బంద్’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశానికి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు, బాబా ఉదయ్ స్వామి (వారణాసి), కుప్ప శ్రీనివాస ప్రసాద్, చంద్రస్వామితో పాటు వివిధ జిల్లాల నుంచి రైతులు, గోభక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వెయ్యి గోవులతో రహదారి దిగ్బంధనం

గోపాష్టమి రోజున పోచంపల్లి రోడ్డులోని కొత్తగూడెం చౌరస్తా సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సుమారు వెయ్యి గోవులు, వేలాది వాహనాలతో 48 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వానికి ఏడు ప్రధాన డిమాండ్లు

గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ, గోరక్షకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుగతులసి ఫౌండేషన్ ఏడు ప్రధాన డిమాండ్లను ప్రకటించింది.

1. గోవుల పోషణకు భత్యం: రక్షించిన ప్రతి గోవు పోషణ కోసం గోశాలలకు రోజుకు రూ.400 చెల్లించాలి.

2. ఉచిత పశుగ్రాసం, విద్యుత్: గోశాలలకు ఉచిత పశుగ్రాసం అందించడంతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా కల్పించాలి.

3. ఆదర్శ గోశాలల ఏర్పాటు: ప్రతి జిల్లాలో గోచర భూములు కేటాయించి ఆదర్శ గోశాలలను నిర్మించాలి.

4. ఉచిత పశువైద్య సేవలు: గోవులకు ఉచిత వైద్యం, INAF ట్యాగింగ్, టీకాల కార్యక్రమాలను అమలు చేయాలి.

5. గోరక్షకులపై కేసుల సమీక్ష: గోరక్షకులపై నమోదైనట్లు పేర్కొంటున్న అక్రమ కేసులు, బ్లైండ్ ఎఫ్‌ఐఆర్‌లను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలి.

6. రైతులకు ప్రోత్సాహం: రక్షించిన పశువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపే రైతులకు ఉచితంగా అందించాలి.

7. శ్వేతపత్రం విడుదల: గత 1,000 రోజుల్లో నమోదైన గోవధ కేసుల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.

గోభక్తులు, రైతులకు పిలుపు

లక్షలాది గోవుల ప్రాణాలను రక్షించడంతో పాటు గోవుల సంరక్షణకు సంబంధించిన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ ఉద్యమంలో గోభక్తులు, రైతు సోదరులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కే. శివకుమార్ పిలుపునిచ్చారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR