Hyderabad: గీతంలో ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ!

Hyderabad: హైదరాబాద్ గీతం వర్సిటీలో ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణతో పాటు గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Nov 2026 10:36 PM IST
Hyderabad
X

Hyderabad: గీతంలో ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ!

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది వృత్తిపరమైన సంభాషణ నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ‘పని ప్రదేశంలో ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సంభాషణ’ అనే అంశంపై నవంబరు 25-26 తేదీలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతంలోని విద్యా నూతన ఆవిష్కరణ, అభివృద్ధి కేంద్రం (సీఏఐఏ) శిక్షకుడు మెహుల్ షా ఉద్యోగులకు ఈమెయిల్, వాట్సాప్ వినియోగం, చేయతగిన, చేయకూడని అంశాలపై తగిన మార్గదర్శనం చేశారు.

వృత్తిపరమైన ఈమెయిల్, వాట్సాప్ కమ్యూనికేషన్లో ఉత్తమ పద్ధతులను మెహుల్ షా వివరిస్తూ, స్పష్టత, మర్యాద, సంక్షిప్తత, సరైన భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈమెయిల్ మర్యాదలు, సమర్థవంతమైన సందేశ నిర్మాణం, వృత్తిపరమైన ధోరణి, సకాలంలో స్పందనలు, సీసీ, బీసీసీల వినియోగం గురించి వివరించారు.

వాట్సాప్ కమ్యూనికేషన్లో చేయవలసినవి, చేయకూడని వాటిని కూడా ఆయన వివరిస్తూ, ఈ ప్లాట్ ఫామ్ ను అధికారిక పత్రాల కోసం కాకుండా, ప్రాథమికంగా త్వరతి సమన్వయం కోసం ఉపయోగించాలని స్పష్టీకరించారు. కమ్యూనికేషన్ హద్దులను గౌరవించాలని, ధృవీకరించని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకుండా ఉండాలని, గోప్యమైన సమాచారాన్ని కాపాడుకోవాలని శిక్షణార్థులకు సూచించారు.

ఈమెయిల్, వాట్సాప్ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మెహుల్ షా వివరిస్తూ, ఆచరణాత్మక ఉదాహరణలు, ఇంటరాక్టివ్ రోల్-ప్లేల ద్వారా, పని ప్రదేశంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంబించేలా శిక్షణార్థులను ప్రోత్సహించారు. సీఏఐఏ వృత్తి నైపుణ్యాల నిపుణుడు సాను జకారియా, శిక్షణా నిర్వహకురాలు డి.ఎం.ప్రియాంక ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

గీతంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని రాజనీతి శాస్త్ర విభాగం, గురువారం ‘రాజ్యాంగ ప్రతిధ్వనులు: మన స్వరాలలో గణతంత్రం – కళ, ఆలోచనలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అనే ఇతివృత్తంతో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.

‘కలలు కనండి, ప్రశ్నించండి, వ్యక్తపరచండి, భాగం కండి’ అనే నినాదంతో జరిగిన ఈ వేడుకలలో, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలపై విద్యార్థులు ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, కళా ప్రదర్శన, రాజ్యాంగ పీఠిక పఠనం, ఇతర ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించారు.

గీతంలోని వివిధ ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రదర్శనను సందర్శించి, అందులో పాల్గొన్నవారితో సంభాషించి, రాజ్యాంగ ప్రాముఖ్యతను అన్వేషించారు. అధ్యాపక బృందం ఈ కార్యక్రమాలంతటా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, అర్థవంతమైన చర్చలను, విభిన్న రంగాల పరిజ్జానాన్ని పెంపొందించింది.

రాజ్యాంగ ఆదర్శాలను, ప్రజాస్వామ్య విలువలను, బాధ్యతాయుత పౌరులుగా వారి పాత్రను అర్థం చేసుకోవడానికి ఈ వేడుకలు విద్యార్థులకు ఒక ఆసక్తికరమైన వేదికను అందించాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్