Ghatkesar: రైల్వే వంతెన బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని అఖిలపక్షం వినతి!
Ghatkesar: ఘట్‌కేసర్‌లో రైల్వే వంతెన, రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని అఖిలపక్షం డీసీ వాణికి వినతిపత్రం అందజేసింది. సర్వే నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని డీసీ తెలిపారు.
Ghatkesar: రైల్వే వంతెన బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని అఖిలపక్షం వినతి!
ఘట్‌కేసర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో రైల్వే వంతెన నిర్మాణం, రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు టీడీఆర్ బాండ్లు మంజూరు చేయాలని అఖిలపక్ష నాయకులు డిప్యూటీ కమిషనర్ వాణిని కోరారు. బాధితులను వెంటబెట్టుకుని బుధవారం ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు.
బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ స్పందిస్తూ.. వంతెన నిర్మాణం, రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారి వివరాలతో పాటు నష్టపోయే స్థలాల విస్తీర్ణంపై ఇప్పటికే సర్వే చేయించినట్లు తెలిపారు.
సర్వే నివేదిక అందిన వెంటనే బాధితులకు నోటీసులు జారీ చేసి, వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న అనంతరం టీడీఆర్ బాండ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణం, రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనప్పుడు ప్రజలు, వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు.
నారాయణ గార్డెన్ నుంచి ఎదులాబాద్(లక్కీ వైన్స్) రోడ్డు వరకు రహదారి నిర్మించాలని మరో వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ వాణి, రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత డీఈని ఆదేశించారు. ఇందుకు అఖిలపక్ష నాయకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచి అబ్బసాని యాదగిరి యాదవ్, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు చింతాల యాదయ్య, సబిత, మాజీ వార్డు సభ్యుడు కొత్తకొండ వెంకటేశ్, జేఏసీ సభ్యుడు అల్లు కమలాకర్, ఎండీ సిరాజ్, బాధితులు కొమ్మిడి మధుసూదన్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.




