Ghatkesar: రైల్వే పట్టాలపై తల్లీబిడ్డ: కాపాడిన ఘట్‌కేసర్ పోలీసులు!

Ghatkesar: భర్త వేధింపులు తాళలేక రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన తల్లీబిడ్డను డయల్-100 సమాచారంతో ఘట్‌కేసర్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు.

KARUNAKAR, UPPAL
Published on: 9 Nov 2026 9:33 PM IST
Ghatkesar
X

Ghatkesar: రైల్వే పట్టాలపై తల్లీబిడ్డ: కాపాడిన ఘట్‌కేసర్ పోలీసులు!

ఘట్‌కేసర్‌: మద్యం మత్తులో భర్త పెడుతున్న వేధింపులు భరించలేక జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో స్పందించిన ఘట్‌కేసర్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తల్లీబిడ్డను రక్షించారు. ఎల్బీనగర్‌కు చెందిన మహేష్‌, మమత (33) దంపతులు ఘట్‌కేసర్‌ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

మహేష్‌ స్థానికంగా ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తుండగా, మమత జోడిమెట్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే మహేష్‌ మద్యానికి బానిసై రోజూ తాగివచ్చి భార్యను వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత తన కుమార్తెతో కలిసి స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌ వద్దకు సోమవారం ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్‌-100కు సమాచారం అందించారు. దీంతో ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్రోల్‌-2కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరమేశ్‌, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి తల్లీబిడ్డను సురక్షితంగా రక్షించారు. అనంతరం మమతకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన ఆమె సోదరి మౌనికకు తల్లీబిడ్డను అప్పగించారు.

సకాలంలో స్పందించి రెండు ప్రాణాలను కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరమేశ్‌, ఇతర సిబ్బందిని ఘట్‌కేసర్‌ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పెండ్యాల కిరణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-112కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సీఐ సూచించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL