Ghatkesar: ఘట్‌కేసర్‌లో వర్షాల కోసం 'సలాతుల్ ఇస్తిస్కా' నమాజు
Ghatkesar: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ చిన్న చెరువు వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో వర్షాల కోసం 'సలాతుల్ ఇస్తిస్కా' నమాజు
ఘట్‌కేసర్: వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని, పంటలు పండించి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని చిన్న చెరువు వద్ద ఘట్‌కేసర్ జామా మసీదు కమిటీ, బాలాజీనగర్‌లోని మహమ్మదియా మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక నమాజు నిర్వహించారు.
వర్షాల కోసం చేసే ఈ ప్రత్యేక ప్రార్థనను ఇస్లాంలో ‘సలాతుల్ ఇస్తిస్కా’గా పిలుస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో ముస్లిం సోదరులు సామూహికంగా నమాజు చేసి అల్లాహ్‌ను ప్రార్థించారు. సమయానికి వర్షాలు కురిసి ప్రకృతి పచ్చదనంతో కళకళలాడాలని, చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరాలని, పాడిపంటలు అభివృద్ధి చెందాలని వేడుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అనుభాయ్), ప్రధాన కార్యదర్శి కుతుబుద్దీన్, బాలాజీనగర్ మహమ్మదియా మసీదు అధ్యక్షుడు షాషాభాయ్, ప్రధాన కార్యదర్శి తాహెర్ అలీ, మసీదుల ఇమామ్‌లు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.




