Ghatkesar: ఘట్‌కేసర్‌లో ప్రమాదకర కేబుల్ వైర్ల తొలగింపునకు డిసి ఆదేశాలు

Ghatkesar: ఘట్‌కేసర్‌ సర్కిల్ పరిధిలో అస్తవ్యస్తంగా వేలాడుతున్న కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు చర్యలు. కేబుల్ ఆపరేటర్లతో డీసీ వాణి సమన్వయ సమావేశం.

KARUNAKAR, UPPAL
Published on: 5 Nov 2026 5:22 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో ప్రమాదకర కేబుల్ వైర్ల తొలగింపునకు డిసి ఆదేశాలు

ఘట్‌కేసర్‌: ప్రధాన రహదారులు, కాలనీల్లో అస్తవ్యస్తంగా వేలాడుతున్న ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, టెలికాం వైర్లను క్రమబద్ధీకరించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటిని తొలగించేందుకు ఘట్‌కేసర్‌ సర్కిల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. వినియోగంలో లేని వైర్లను వెంటనే తొలగించాలని సంబంధిత ఆపరేటర్లను ఆదేశించారు.

ఈ మేరకు గురువారం మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్‌ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ వాణి అధ్యక్షతన కేబుల్‌ ఆపరేటర్లు, ఇంజినీరింగ్‌, పారిశుధ్య విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపయోగ వైర్లను గుర్తించి తొలగించాలని ఆపరేటర్లకు డిప్యూటీ కమిషనర్ సూచించారు.

వైర్ల తొలగింపునకు ముందు అధికారులకు సమాచారం అందించాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా తొలగించకపోతే శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఎఫ్‌ఏ) ద్వారా మున్సిపల్‌ సిబ్బందితో వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.

అన్ని వార్డుల్లో ఇంజినీరింగ్‌, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగాల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాన రహదారులు, అంతర్గత కాలనీల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లను గుర్తించాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ చేపట్టే ఈ కార్యక్రమానికి కేబుల్‌ ఆపరేటర్లు మున్సిపల్‌ అధికారులకు సహకరించాలని డిప్యూటీ కమిషనర్‌ వాణి కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL