Ghatkesar: ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో తీవ్ర నీటి కష్టాలు.. మరుగుదొడ్లకు తాళం

Ghatkesar: ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో నీళ్లు లేక మరుగుదొడ్లు బంద్. ప్రయాణికులు, విద్యార్థుల తీవ్ర అవస్థలు. పెండింగ్ అభివృద్ధి పనులపై స్థానికుల ఆగ్రహం.

KARUNAKAR, UPPAL
Published on: 10 Nov 2026 4:01 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో తీవ్ర నీటి కష్టాలు.. మరుగుదొడ్లకు తాళం

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రయాణికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా ‘నీళ్లు లేవు.. బంద్‌.. రేపు రాగలరు’ అంటూ మరుగుదొడ్ల వద్ద నోటీసులు అతికించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

నిత్యం వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు రాకపోకలు సాగించే బస్టాండ్‌లో కనీసం మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి నగరపాలక సంస్థలో ఘట్‌కేసర్‌ ఒక సర్కిల్‌గా ఏర్పడినప్పటికీ, ఇక్కడి ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలో పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండటంతో విద్యార్థులకు బస్టాండ్‌ ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి కీలక ప్రాంతంలో నీటి కొరతతో మరుగుదొడ్లు మూసివేయడం ఇబ్బందికరంగా మారింది.

ఘట్‌కేసర్‌ కేంద్రంలో ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యలు

ఘట్‌కేసర్‌ కేంద్రంలో సమస్యలు ఒక్క బస్టాండ్‌కే పరిమితం కాలేదు. ఏళ్ల తరబడి రైల్వే వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల పాఠశాల సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి.

మరోవైపు సరైన రహదారులు లేక వాహనదారులు, స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సర్కిల్‌ పరిధిలోని వివిధ డివిజన్లలోనూ తాగునీటి కొరత, అధ్వాన రహదారులు, డ్రెయినేజీ సదుపాయాల లేమి ప్రజలకు శాపంగా మారాయి. కనీస మౌలిక వసతుల కల్పనలోనూ అధికారులు విఫలమవుతున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడే బాగుండేది!

ఒకప్పుడు గ్రామపంచాయతీగా ఉన్న ఘట్‌కేసర్‌ అనంతరం మున్సిపాలిటీగా, ప్రస్తుతం మల్కాజిగిరి నగరపాలక సంస్థలో సర్కిల్‌గా మారింది. పాలనా వ్యవస్థలు మారుతున్నా అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదని స్థానికులు అంటున్నారు.

సర్కిల్ పరిధిలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడే అభివృద్ధి మెరుగ్గా ఉండేదని, మున్సిపాలిటీగా కొనసాగినప్పుడైనా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేవనే అభిప్రాయాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. కనీసం మున్సిపాలిటీ హోదాలోనే కొనసాగించి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఇప్పటికైనా ప్రభుత్వం, మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఘట్‌కేసర్‌ సర్కిల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడం, గురుకుల పాఠశాల సమస్యలను పరిష్కరించడం, బస్టాండ్‌ను అభివృద్ధి పరచడం, రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి పనులకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాలనా మార్పులతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL