Ghatkesar: 17 ఏళ్ల నిరీక్షణకు నిరసనగా ఘట్కేసర్ బంద్..అఖిలపక్షం డిమాండ్!
Ghatkesar: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో 17 ఏళ్లుగా నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అఖిలపక్షం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది.
Ghatkesar: 17 ఏళ్ల నిరీక్షణకు నిరసనగా ఘట్కేసర్ బంద్..అఖిలపక్షం డిమాండ్!
Ghatkesar: రైల్వే వంతెన నిర్మాణంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న జాప్యం.. మరోవైపు వంతెన పనులు పూర్తికాక పట్టణం మీదుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. పాలకుల నిర్లక్ష్యంపై నిరసనగా ఘట్కేసర్ పట్టణంలో సోమవారం అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపు ప్రశాంతంగా కొనసాగింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పట్టణంలో పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ ఆందోళనకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు, ఆటో, ట్యాక్సీ కార్మికులు మద్దతు పలికారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
సుమారు 17 ఏళ్లుగా రైల్వే వంతెన నిర్మాణం కోసం పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నా పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన నిర్మాణ పనులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వాలు మారినా నేటికీ కొలిక్కి రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వంతెన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే గేటు నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ వంతెన నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని నినదించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిలపక్ష నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఘట్కేసర్ పట్టణం మీదుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ విద్య, ఉద్యోగ, ఇతర అవసరాల కోసం ప్రయాణించే సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రజల సమస్యను ఇకనైనా తీవ్రంగా పరిగణించి వంతెన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వంతెనకు ఇరువైపులా రహదారులను విస్తరించడంతోపాటు, జిల్లా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఘట్కేసర్ పట్టణంలోకి అనుమతించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




