Hyderabad: మందుబాబులకు షాక్.. హైదరాబాద్‌లో లిక్కర్ షాపులు బంద్
Liquor shops closed in Hyderabad: గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో నిర్ణీత సమయం వరకు లిక్కర్ షాపులు మూసివేయనున్నారు.
Liquor shops closed in Hyderabad
Liquor shops closed in Hyderabad: గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో మందుబాబులకు షాక్ తగిలింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో లిక్కర్ షాపులు, బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. ఈ సమయంలో వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు 24 గంటల పాటు మూసి ఉంచాలని సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆదేశించారు.
అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో నిర్వహించే బార్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా సాగేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మద్యం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.
పలు జిల్లాల్లోనూ లిక్కర్ షాపులు బంద్
హైదరాబాద్, సైబరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లోనూ మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిమజ్జనాల నేపథ్యంలో నిర్ణీత సమయం వరకు వైన్ షాపులు మూసి ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు.
హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు లిక్కర్ షాపులు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో నిమజ్జనాల సమయంలో మద్యం విక్రయాలకు పూర్తిగా బ్రేక్ పడనుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 20 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నిషేధం అమల్లో ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇక గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ఇప్పటికే డీజేలకు కూడా పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారీగా తరలివచ్చే భక్తులు, వినాయక విగ్రహాల ఊరేగింపుల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు.




