Chandanagar: చందానగర్‌లో ఘనంగా పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!

Chandanagar: చందానగర్‌లోని డఫ్ అండ్ డమ్ స్కూల్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 31 Oct 2026 12:25 PM IST
Chandanagar
X

Chandanagar: చందానగర్‌లో ఘనంగా పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!

Chandanagar: స్థానిక డఫ్ అండ్ డమ్ (చెవిటి మరియు మూగ) స్కూల్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యతా దినోత్సవం) మరియు భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ మరియు పాప్‌కార్న్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్‌గా పటేల్ సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు.

500కు పైగా స్వదేశీ సంస్థానాలను, అలాగే జూనాగఢ్, హైదరాబాద్‌లను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని పేర్కొన్నారు. తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించిన ఆయనను 'ఆధునిక అఖిల భారత సర్వీసుల స్థాపకుడి'గా పిలుస్తారని తెలిపారు.

అలాగే, దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 'ఉక్కు మహిళ'గా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాల ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేశారని గుర్తుచేశారు. దేశ రక్షణలో భాగంగా అణు పరీక్షలు నిర్వహించి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని కఠినంగా అణచివేశారని అన్నారు. పటేల్, ఇందిరాగాంధీల జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సామాజిక సమస్యలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరిచేత జాతీయ సమైక్యత, సమగ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, జనార్ధన్, వాణి సాంబశివరావు, పాలం శ్రీను, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి మెర్సీ, ఉపాధ్యాయురాలు శ్రీమతి శోభ తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY