Pargi: సబ్‌‌స్టేషన్ భూ సేకరణపై గ్రామసభలో రైతుల ఆవేదన

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖూదావన్ పూర్‌లో సబ్‌స్టేషన్ భూ సేకరణపై నిర్వహించిన గ్రామసభలో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

WAZID, PARIGI
Published on: 30 Sept 2026 4:46 PM IST
Pargi
X

Pargi: సబ్‌‌స్టేషన్ భూ సేకరణపై గ్రామసభలో రైతుల ఆవేదన

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖూదావన్ పూర్‌లో 400/22 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం భూ సేకరణకు సంబంధించి ఖూదావన్ పూర్ గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని సర్వే నంబర్ 98లో ఉన్న 84.34 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సేకరించేందుకు అధికారులు ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న మొత్తం 69 మంది రైతులు తమ అభిప్రాయాలను అధికారుల ముందు వెల్లడించారు.

అయితే గ్రామ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య సభను నిర్వహించారు.భూమి లేని వ్యక్తులను సభలోకి అనుమతించకుండా కేవలం సంబంధిత రైతుల అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.ఇక తమ భూములను సబ్‌స్టేషన్ కోసం తీసుకోవద్దంటూ పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భూమికి బదులుగా భూమి ఇవ్వాలి... మా జీవనాధారం ఈ భూములే... మాకు వేరే దిక్కు లేదు అంటూ రైతులు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.

ప్రభుత్వం భూమికి బదులుగా డబ్బులు ఇస్తే తమ జీవనం ఎలా కొనసాగుతుందని రైతులు ప్రశ్నించారు.డబ్బులు ఇస్తే మేము ఏం చేసుకోవాలి... మాకు భూమి ఉంటే వ్యవసాయం చేసుకొని బతుకుతాం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ వద్ద ఉన్న భూములే తమ కుటుంబాలకు ఆధారమని, వాటిని కోల్పోతే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు తెలిపారు.

అంతేకాదు...భూములు ఇచ్చేందుకు మేమైతే సిద్ధంగా లేము అంటూ రైతులు తేల్చి చెప్పారు.మొత్తంగా 400/22 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియపై ఖూదావన్ పూర్ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గ్రామ సభలో రైతుల ఆవేదన ప్రధానంగా వినిపించింది.ఇప్పుడు రైతుల అభ్యంతరాలను అధికారులు ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారు?

భూ సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

WAZID, PARIGI

WAZID, PARIGI