Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట RRR భూ బాధిత రైతుల ఆందోళన!
Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట RRR భూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రాజకీయ నేతల భూములు కాపాడేందుకే మూడుసార్లు అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపించారు.
Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట RRR భూ బాధిత రైతుల ఆందోళన!
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట RRR (రీజినల్ రింగ్ రోడ్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. తమ భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం RRR రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే రోడ్డు అలైన్మెంట్‌ను మూడుసార్లు మార్చడానికి గల కారణాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
ముందుగా నిర్ణయించిన అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మిస్తే రాజకీయ నాయకులకు చెందిన భూములు కోల్పోవాల్సి వస్తుందనే కారణంతోనే అలైన్మెంట్‌ను మార్చారంటూ రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకుల భూములను కాపాడుతూ, సామాన్య రైతుల భూములను బలిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములను కోల్పోతే కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ న్యాయం జరిగే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి అలైన్మెంట్ మార్పులపై సమగ్ర వివరణ ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.




