Shabad: సంకేపల్లిగూడెంలో ఘనంగా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ అవగాహన కార్యక్రమం!
Shabad: షాబాద్ మండలం సంకేపల్లిగూడెంలో పొలంబడి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించి రైతులకు సలహాలు అందించారు.
Shabad: సంకేపల్లిగూడెంలో ఘనంగా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ అవగాహన కార్యక్రమం!
Shabad: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సహకారంతో వ్యవసాయ శాఖ, షాబాద్ ఆధ్వర్యంలో సంకేపల్లిగూడెం గ్రామంలో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ (పొలంబడి) అవగాహన కార్యక్రమం మరియు క్షేత్ర సందర్శన నిర్వహించారు.
మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర ఆధ్వర్యంలో డా. టి. రాజేశ్వర్ రెడ్డి, శాస్త్రవేత్త, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టి.ఆర్.వి.కె), వికారాబాద్ మరియు డా. వై. భారతి, సీనియర్ సైంటిస్ట్, వ్యవసాయ పరిశోధనా స్థానం (ఏ.ఆర్.ఎస్), తాండూర్ పాల్గొని రైతులకు పంటల శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డా. టి. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులు విత్తనాల ఎంపిక, విత్తన నాణ్యత, విత్తన శుద్ధి, నారుమడి యాజమాన్యం, కాలిబాటల ఏర్పాటు, నాట్లు వేయడం, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, పురుగు మరియు తెగుళ్ల నివారణ వంటి అంశాలపై పంట వివిధ దశల్లో ప్రత్యక్షంగా అవగాహన పొందవచ్చని తెలిపారు. పంటను విత్తనం వేసిన దశ నుంచి కోత వరకు శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర మాట్లాడుతూ, వరి పంట వివిధ దశల్లో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వరి సాగుపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
డా. వై. భారతి, సీనియర్ సైంటిస్ట్, ఏ.ఆర్.ఎస్, తాండూర్ మాట్లాడుతూ, రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలించి ప్రారంభ దశలోనే పురుగు, తెగుళ్ల సమస్యలను గుర్తించాలని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగుమందులు, తెగుళ్ల నివారణ మందులను సరైన మోతాదులో ఉపయోగించాలని, సమగ్ర పురుగు–తెగుళ్ల యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అనంతరం శాస్త్రవేత్తలు,
వ్యవసాయ అధికారులు మరియు రైతులతో కలిసి వరి, టమాటా, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంటలో కాండం తొలుచు పురుగు (స్టెమ్ బోరర్) ఉనికిని గుర్తించి, రైతులకు తగిన సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులను వివరించారు. టమాటా పంటలో ఫైటోఫ్తోరా బ్లైట్ లక్షణాలను గుర్తించి, వ్యాధి నియంత్రణకు డైమెథోమార్ఫ్ - 2 గ్రా./లీటరు నీటికి పిచికారీ చేయాలని సూచించారు. పత్తి పంటలో జాసిడ్లు, త్రిప్స్, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగుల నష్టాన్ని గుర్తించి, అవసరమైనప్పుడు ఫ్లోనికామిడ్ 50 డబ్ల్యూజి 80 గ్రా./ఎకరాకు లేబుల్ సిఫార్సుల మేరకు వినియోగించాలని సూచించారు.
పురుగు మరియు తెగుళ్ల నియంత్రణలో భాగంగా రైతులు ముందుగా పంటలను క్రమం తప్పకుండా పరిశీలించాలని, అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగుమందులను వినియోగించాలని, ఒకే రకమైన పురుగుమందును పదేపదే ఉపయోగించకుండా చర్యా విధానం భిన్నంగా ఉన్న మందులను మారుస్తూ ఉపయోగించాలని శాస్త్రవేత్తలు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి కుమ్మరి లావణ్య చెన్నయ్య, ఏఈవో శ్రీ శివ తేజ, పంచాయతీ కార్యదర్శి శ్రీ ఫయాజ్, పొలంబడి రైతు శ్రీ జి. సత్యనారాయణ రెడ్డితో పాటు రైతులు శ్రీ నర్సింహారెడ్డి, శ్రీ అంజయ్య, శ్రీ పి. అంజిరెడ్డి, శ్రీ బి. సత్తయ్య, శ్రీ జి. నరసింహారెడ్డి, శ్రీ శివరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ, ప్రతి రైతు ఫార్మర్ ఐడీ/రైతు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, సబ్సిడీలు, పంటల కొనుగోలు, ఎరువుల కొనుగోలు మరియు పంట రుణాలకు సంబంధించిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
రైతులు తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవోల), మీ-సేవ లేదా సి.ఎస్.సి కేంద్రాల ద్వారా రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, అలాగే ఆన్‌లైన్ పంట నమోదు (డిజిటల్ క్రాప్ సర్వే) తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. గ్రామాల్లో పంట నమోదు వాలంటీర్లు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం పంటల ఉత్పత్తుల కొనుగోలు తదితర కార్యక్రమాల్లో పంట నమోదు వివరాలను ఆధారంగా తీసుకునే అవకాశం ఉన్నందున, పంట నమోదు వాలంటీర్లు గ్రామానికి వచ్చినప్పుడు రైతులు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి, సాగు చేసిన పంటకు సంబంధించిన సరైన వివరాలను అందించి పంట నమోదు పూర్తి చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు.




