Rangareddy: చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌కు మూడేళ్లు.. హామీల అమలు ఎక్కడ?

Rangareddy: చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌కు మూడేళ్లయినా అంబేద్కర్ అభయహస్తం రూ.12 లక్షలు, 18 శాతం రిజర్వేషన్ల హామీలు అమలు కాలేదని మాజీ ఎంపీటీసీ గ్యార వెంకటయ్య విమర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 12:02 PM IST
Rangareddy
X

Rangareddy: చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌కు మూడేళ్లు.. హామీల అమలు ఎక్కడ?

Rangareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌కు మూడేళ్లు దాటినా అందులోని ప్రధాన హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని మాడ్గుల మండలం సుద్దపల్లి మాజీ ఎంపీటీసీ గ్యార వెంకటయ్య విమర్శించారు.

దళితుల ఆర్థికాభివృద్ధి, విద్య, ఉపాధి, రాజకీయ సాధికారత కోసం అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మూడేళ్లు కావస్తున్నా వాటిని నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. 2023 ఆగస్టు 26న చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు ఎంతవరకు వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రూ.12 లక్షల అభయహస్తం.. 18 శాతం రిజర్వేషన్లు ఎక్కడ?

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వెంకటయ్య గుర్తుచేశారు. గత ప్రభుత్వ దళితబంధు పథకాన్ని విమర్శించి అంతకంటే ఎక్కువ సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి రూ.12 లక్షలు అందించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అమలును స్వాగతిస్తున్నప్పటికీ అది ప్రస్తుతం ఉన్న 15 శాతం రిజర్వేషన్ల పరిధిలోనే ఉందన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం వాటా కల్పిస్తామన్న హామీ అమలుపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు.

విద్య, ఉపాధి హామీల సంగతేంటి?

ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు, విద్యాజ్యోతులు పథకం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం వంటి హామీల అమలు ఎంతవరకు వచ్చిందని వెంకటయ్య ప్రశ్నించారు. ఈ పథకాలకు కేటాయించిన నిధులు, ఖర్చులు, లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

భారత్ సమ్మిట్‌లో సామాజిక న్యాయం.. తెలంగాణలో అమలు ఏది?

నవంబర్ 14న తెలంగాణలో జరిగే భారత్ సమ్మిట్‌కు హాజరుకానున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేవెళ్ల డిక్లరేషన్ అమలుపై సమాధానం చెప్పాలని వెంకటయ్య డిమాండ్ చేశారు. అంతర్జాతీయ వేదికలపై సామాజిక న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే నాయకులు తెలంగాణ దళితులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో వివరించాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ వంటి కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆర్థిక సాధికారతకు సంబంధించిన ప్రధాన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ హామీలను వాయిదా వేయడం సరికాదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, ఖర్చు చేసిన నిధులు, లబ్ధిదారుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని గ్యార వెంకటయ్య డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY