Malkajgiri: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సీపీఐ, సీపీఎం!
Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ చౌరస్తాలో గురువారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
Malkajgiri: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సీపీఐ, సీపీఎం!
మల్కాజిగిరి: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఐ, సీపీఎం నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆనంద్‌బాగ్ చౌరస్తాలో సీపీఐ, సీపీఎం మల్కాజిగిరి మండల కమిటీల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతులను చేతబట్టి రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు, సీపీఎం సీనియర్ నాయకుడు కృపాసాగర్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిన మహోన్నత గ్రంథం భారత రాజ్యాంగమని పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ మౌలిక విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా పక్కనపెడుతూ, దాని విలువలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మధ్య కుల, మత విభేదాలను సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా కొనసాగాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి, దాని విలువలను ఆచరణలో అమలు చేయాలని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు సీహెచ్ ఆనందరావు భారత రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. సీపీఐ మండల సహాయ కార్యదర్శి కే. అశోక్, నాయకులు రొయ్యల గిరిజ, ఎస్.కే. అజీజ్, బి. లింగం, కే. పవన్, ఈ. వెంకటేష్, సీపీఎం నాయకులు బి. కొండల్, మురళీమోహన్, సూర్యనారాయణ, సరోజ, స్వాతి, చిట్టమ్మ, సాయి తదితరులు పాల్గొన్నారు.




