Medchal: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పొగలు, నురుగును నివారించాలి!

Medchal: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడే పొగ, మురుగు నురుగును అరికట్టాలని పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి డిమాండ్. లేకుంటే భారీ ఆందోళన తప్పదని హెచ్చరిక.

PURENDAR, ALWAL
Published on: 18 Sept 2026 7:25 PM IST
Medchal
X

Medchal: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పొగలు, నురుగును నివారించాలి!

మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, కీసర సర్కిల్, జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్మికనగర్‌లో డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగలు, మురుగునీటి నురుగుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ తెలిపారు.

గత రెండు రోజులుగా పట్టపగలే చీకట్లను తలపించేలా దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయని, మురుగునీటి నురుగు పెద్దఎత్తున బుడగలుగా ఏర్పడి గాలిలో తేలుతూ ఇళ్లలోకి చేరుతోందని వారు పేర్కొన్నారు. నురుగు పగిలిన సమయంలో భరించలేని దుర్వాసన వస్తుండటంతో కార్మికనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దుర్వాసనతో కూడిన పొగలు, మురుగునీటి నురుగు కారణంగా కళ్లలో మంట, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటి పైప్‌లైన్‌ను అర్ధరాత్రి ధ్వంసం చేసి, మురుగునీటిని కార్మికనగర్ వైపు వదిలిన ఘటనలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపించారు.

డంపింగ్ యార్డు విస్తరణ కోసం కార్మికనగర్ నుంచి స్థానిక నివాసులను తరలించేందుకు రాంకీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కార్మికనగర్‌లో నివసించే పిల్లలు, వృద్ధులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాంకీ యాజమాన్యం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని షేక్ షావలి, ఉమామహేష్ డిమాండ్ చేశారు.

డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగలు, దుర్వాసన, మురుగునీటి నురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL