Hyderabad: సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు!

Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన 'సంవిధాన్ రక్షక్ మార్చ్'లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సనత్‌నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 27 Nov 2026 10:55 AM IST
Hyderabad
X

Hyderabad: సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు!

Hyderabad: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో డాక్టర్ కోట నీలిమ నాయకత్వంలో సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు మార్చ్ కొనసాగింది.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, మతం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించడం బీజేపీ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే బీజేపీ విధానాలను ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భావితరాలకు రాజ్యాంగ గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు, రాజ్యాంగ విలువల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే సంవిధాన్ రక్షక్ మార్చ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగ పరిరక్షణకు, బడుగు బలహీన వర్గాల హక్కులకు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ కోట నీలిమ నాయకత్వంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ మార్చ్‌లో పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE