Shabad: షాబాద్ మండలంలో 5 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి!
Shabad: షాబాద్ మండలాన్ని రాష్ట్రంలోనే తొలి 100% అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దేందుకు 5 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు.
Shabad: షాబాద్ మండలంలో 5 రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలి!
షాబాద్: షాబాద్ మండలాన్ని ఉల్లాస్ – నవ భారత్ సాక్షరతా కార్యక్రమం కింద రాష్ట్రంలోనే తొలి 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి సర్వేను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని మండల అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టం చేశారు.
SEEEPC సర్వే ప్రకారం షాబాద్ మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 15,507 కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కుటుంబాలను అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, SERP VOAs, VB-G RAM G సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సమానంగా కేటాయించి, ప్రతి ఇంటిని సందర్శించి నిరక్షరాస్యులను గుర్తించాలని సూచించారు.
ఈ సర్వేకు MPDO షాబాద్ మండల స్థాయి ఓవరాల్ ఇన్ఛార్జిగా వ్యవహరించాలని ఆదేశించారు. MRO, MEO, CDPO, APM-SERP, APO-MGNREGS అధికారులు తమ పరిధిలోని సిబ్బందిని వెంటనే కేటాయించి, సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సర్వేలో భాగంగా 15 సంవత్సరాలు నిండిన ప్రతి నిరక్షరాస్యుడిని గుర్తించి వయోజన విద్యాశాఖ అందించే ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేయాలని, ముఖ్యంగా 15 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులందరినీ గుర్తించి ఉల్లాస్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సర్వే పూర్తయిన వెంటనే గ్రామాల్లో అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసి, వాలంటీర్లు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) సహకారంతో బోధనా కార్యక్రమాలను ప్రారంభించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత అందించడమే లక్ష్యంగా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేసి షాబాద్ మండలాన్ని 100 శాతం అక్షరాస్య మండలంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేకు అవసరమైన ప్రొఫార్మా, శిక్షణ, సాంకేతిక సహకారాన్ని జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకులు శ్రీమతి కె. అనిత అందిస్తారని తెలిపారు.




