Jawaharnagar: జవహర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాల స్థలాలను పరిశీలించిన కలెక్టర్
Jawaharnagar: జవహర్‌నగర్ గబ్బిలాల పేటలో నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి స్థలాలను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి. అధికారులకు పలు కీలక ఆదేశాలు.
Jawaharnagar: జవహర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాల స్థలాలను పరిశీలించిన కలెక్టర్
జవహర్ నగర్: కాప్రా మండలం జవహర్ నగర్ గబ్బిలాల పేటలో అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ మను చౌదరి గురువారం స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల సంఖ్య, తరగతుల నిర్వహణ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆధార్ లేని విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కాప్రా తహసీల్దార్ మతిన్‌ను ఆదేశించారు.
గబ్బిలాల పేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణలో భాగంగా సర్వే నంబర్లు 285, 299, 300, 185లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా స్థలాలకు సంబంధించి భూ వివాదాలు, కోర్టు కేసులు తదితర సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
స్థానికులు 300 లేదా 185 సర్వే నంబర్లలో పాఠశాల నిర్మిస్తే విద్యార్థులు, ప్రజలకు అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతులు ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, కాప్రా మండల తహసీల్దార్ మతిన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




