Ghatkesar: సీఎం విజన్ ఒకవైపు.. ఘట్‌కేసర్‌లో పరిస్థితి మరోవైపు!

Ghatkesar: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలన్న సీఎం రేవంత్ విజన్‌కు భిన్నంగా ఘట్‌కేసర్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు, మౌలిక వసతుల లేమిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

KARUNAKAR, UPPAL
Published on: 1 Oct 2026 3:37 PM IST
Ghatkesar
X

Ghatkesar: సీఎం విజన్ ఒకవైపు.. ఘట్‌కేసర్‌లో పరిస్థితి మరోవైపు!

ఘట్‌కేసర్: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్‌కు అనుగుణంగా పాలన సాగుతోందా? అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన అధికార యంత్రాంగం అదే దిశలో పనిచేస్తుందా? అనే ప్రశ్నలు ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో వినిపిస్తున్నాయి. ఒకవైపు అక్రమ నిర్మాణాలపై ఆరోపణలు.. మరోవైపు కనీస మౌలిక సదుపాయాల కోసం ప్రజల అవస్థలు.. వెరసి అధికారుల పనితీరుపై చర్చకు దారితీస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి నగరపాలక సంస్థలను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థను ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ మూడు జోన్ల తో 14 సర్కిళ్లు, 74 డివిజన్ లుగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉప్పల్ జోన్ పరిధి ఘట్‌కేసర్ సర్కిల్‌ లో ఘట్‌కేసర్, ఏదులాబాద్, పోచారం, నాగారం డివిజన్లు ఉన్నాయి.

వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలన్నదే నగరపాలక సంస్థ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో మౌలిక వసతుల లేమి తోపాటు అక్రమ షెడ్లు, ఫామ్‌హౌస్‌లు, అనుమతులకు విరుద్ధమైన నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి.

అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత నోటీసులు జారీ చేయడం, కొన్నిచోట్ల తాత్కాలికంగా కూల్చివేతలు చేపట్టడం జరుగుతున్నప్పటికీ , కాస్త విరామం ప్రకటించి ఆ తర్వాత మళ్లీ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నోటీసులు ఇవ్వడం ఎందుకు? కూల్చివేతలు చేయడం ఎందుకు? మళ్లీ నిర్మాణాలు చేస్తుంటే చోద్యం చూడడం ఎందుకు అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారా? లేక చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. ప్రజల సమస్యలు

ఇదే సమయంలో ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని కొన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జనాభా పెరుగుతున్నప్పటికీ.. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు అందడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఒకవైపు అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయి నియంత్రణ కనిపించకపోవడం.. మరోవైపు ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అందకపోవడం అధికారుల ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సీఎం విజన్‌కు క్షేత్రస్థాయి అమలు కీలకం

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో.. ఆ విజన్‌ క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను అడ్డుకోవడం, మున్సిపల్ సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని పరిరక్షించడం వంటి అంశాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

సీఎం అభివృద్ధి విజన్‌ ఒకవైపు.. ఘట్‌కేసర్‌లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు, మౌలిక వసతుల కొరత మరోవైపు కనిపిస్తుండటంతో.. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘట్‌కేసర్‌ సర్కిల్‌కే పరిమితం కాకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ఇతర సర్కిళ్లలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణలో లోపమా? స్థానిక ఒత్తిళ్ల ప్రభావమా? లేక క్షేత్రస్థాయిలో సమన్వయ లోపమా? అనేది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి కలలుగంటున్న ప్రపంచస్థాయి హైదరాబాద్‌కు పునాది వేసే క్రమంలో.. క్షేత్రస్థాయి పాలన కూడా అదే స్థాయిలో ఉండాలన్నదే ప్రజల ఆకాంక్ష.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL