Parigi: పరిగిలో బోరుబావి వివాదం.. 17 నెలల పసిపాపపై కనికరం లేని దాడి!
Parigi: వికారాబాద్ జిల్లా పరిగి సాలిపాలబాట తాండాలో బోరుబావి వివాదంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. దాడిలో 17 నెలల పసిపాపతో సహా ఇద్దరికి గాయాలయ్యాయి.
Parigi: పరిగిలో బోరుబావి వివాదం.. 17 నెలల పసిపాపపై కనికరం లేని దాడి!
Parigi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సాలిపాలబాట తాండాలో బోరుబావి విషయంలో దాయాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బోరుబావి తమదంటే తమదంటూ చందర్, రవి కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బోరుబావికి సంబంధించిన పైప్‌లైన్‌ను రవి కుటుంబ సభ్యులు కత్తిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై వీడియో తీస్తూ ప్రశ్నించిన చందర్, ఆయన కూతురు సుచిత్రపై రవి కుమారుడు తులసీరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిని వెంబడిస్తూ ఇంటి వరకు వెళ్లిన తులసీరాం.. ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిలో చందర్‌తో పాటు ఆయన కూతురు సుచిత్రకు గాయాలయ్యాయి. అంతేకాకుండా 17 నెలల పసిపాపను సైతం కనికరం లేకుండా విసిరేయడంతో చిన్నారి తలకు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చందర్ వీపుపై కూడా రక్తగాయాలయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, పైప్‌లైన్ కత్తిరించిన ఘటనపై గతంలోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు చందర్ ఆరోపిస్తున్నారు.
చిన్నారిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.అసలు బోరుబావి వివాదం ఎందుకు మొదలైంది? 17 నెలల పసిపాపపై దాడికి బాధ్యులెవరు? బాధితులకు న్యాయం జరుగుతుందా? అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




