Chandanagar: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
Chandanagar: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Chandanagar: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
చందానగర్: ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్‌లోని PJR స్టేడియంలో శనివారం ఉదయం ఉచిత మధుమేహ, రక్తపోటు (బీపీ) మరియు పల్స్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఓమెగా/ PRK హాస్పిటల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 109 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, మధుమేహ వ్యాధి వల్ల కలిగే అనర్థాలపై నేడు ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో అవగాహన కార్యక్రమాలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ జనాభాలో సుమారు 58.9 కోట్ల మంది పెద్దలు ఈ వ్యాధితో జీవిస్తున్నారని, మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేకపోవడమే మధుమేహమని ఆయన వివరించారు.
మారుతున్న జీవనశైలి, పర్యావరణ మార్పుల కారణంగా నేడు దాదాపు ప్రతి కుటుంబంలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారని, చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపి మనిషి ఆయుష్షును తగ్గించే ఈ దీర్ఘకాలిక వ్యాధి ఒక 'సైలెంట్ కిల్లర్' అని పేర్కొన్నారు.
దీనివల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య మరియు ప్రాణ నష్టాలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ సంయుక్తంగా ఏటా నవంబర్ 14న అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇన్సులిన్‌ను కనిపెట్టిన సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజు కావడంతో ఈ తేదీని ఎంచుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం 'మధుమేహంపై ముందస్తు చర్య' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, M.S. నారాయణ, పాలం శ్రీను, నారాయణరెడ్డి, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, బాల్‌రాజ్ మరియు హాస్పిటల్ ప్రతినిధులు జాకీర్ హుస్సేన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




