Talakondapally: తలకొండపల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకుడు గౌతరెడ్డి విజయకుమార్ రెడ్డి డిమాండ్.
Talakondapally: తలకొండపల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి!
Talakondapally: పంటలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయి, పెట్టుబడులు సైతం తిరిగి రాని పరిస్థితుల్లో తలకొండపల్లి మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు గౌతరెడ్డి విజయకుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీల పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి, తక్షణమే కరువు మండలంగా ప్రకటించి అర్హులైన రైతులకు కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలకొండపల్లి మండలం ధనిక ప్రాంతమా? ఇక్కడి రైతులంతా లక్షాధికారులా? పంటలు ఎండిపోతూ, బోర్లలో నీరు అడుగంటిపోతుంటే ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మండలంలో నదీ జలాలు, సాగునీటి కాలువలు, పెద్ద చెరువుల ద్వారా నిరంతర సాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు వర్షాలు, భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.
ఒకవైపు పంట నష్టాలు, మరోవైపు పెరిగిన నిత్యావసర ధరలు, వ్యవసాయ పెట్టుబడుల భారం రైతు కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని విజయకుమార్ రెడ్డి అన్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని కరువు జాబితా నుంచి మినహాయించడం రైతులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే మండలంలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఆయన కోరారు. పంట నష్టం, భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, రైతుల ఆర్థిక ఇబ్బందులను సమగ్రంగా అంచనా వేసి తలకొండపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన రైతులకు కరువు సహాయం అందించడంతో పాటు రుణమాఫీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులు పంటలు పండక నష్టపోతున్న సమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గౌతరెడ్డి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు.




