Ghatkesar: మూసీ ప్రక్షాళన సరే.. రైతులకు అన్యాయం వద్దు: సుదర్శన్‌రెడ్డి!
Ghatkesar: మూసీ ప్రక్షాళన పేరుతో రైతుల భూములను లాక్కోవద్దని, ఎకరానికి 1,741 గజాల అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వాలని ఘట్‌కేసర్‌లో బీజేపీ నేత సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Ghatkesar: మూసీ ప్రక్షాళన సరే.. రైతులకు అన్యాయం వద్దు: సుదర్శన్‌రెడ్డి!
ఘట్ కేసర్: మూసీ ప్రక్షాళన, అభివృద్ధి పేరుతో రైతుల భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా.. రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేలా స్పష్టమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ కొర్రెములలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధి పనులకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి కోసం రైతుల భూములు తీసుకునే సమయంలో వారికి అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. భూసేకరణకు ముందు రైతులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భూములకు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు అభివృద్ధిలో రైతులకు సముచిత వాటా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రతిపాదించిన విధానంలో రైతులకు 60 శాతం, ప్రభుత్వానికి 40 శాతం వాటా కల్పించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. ప్రస్తుత మూసీ ప్రక్షాళన, అభివృద్ధి పనుల్లోనూ రైతులకు న్యాయం జరిగేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. రైతుల నుంచి భూములు తీసుకుంటే ఎకరానికి 1,741 గజాల అభివృద్ధి చేసిన భూమిని అందించాలని సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూములకు తగిన న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు.
భూములు తీసుకున్న తర్వాత అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు రైతులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకుండా.. పనులు పూర్తిచేసే కాలపరిమితిని ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలని అన్నారు. అభివృద్ధి పేరుతో భూములపై ఆంక్షలు విధించడం వల్ల రైతులు తమ కుటుంబ అవసరాలకు సైతం భూములను వినియోగించుకోలేని పరిస్థితి రాకూడదన్నారు.
రైతుల భూములకు సంబంధించిన ప్రక్రియలో ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలకు తావులేకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రైతుల భూములు వారి కుటుంబాలకు జీవనాధారమని.. అలాంటి భూములపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి ప్రయోజనాలను విస్మరించరాదని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




