Kapra: భావన నగర్‌లో నివాసుల హక్కుల పరిరక్షణ జేఏసీ ఏర్పాటు!
Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ భావన నగర్‌లో నివాసుల హక్కుల పరిరక్షణ, పారదర్శకతే లక్ష్యంగా జేఏసీ ఏర్పాటైంది.
Kapra: భావన నగర్‌లో నివాసుల హక్కుల పరిరక్షణ జేఏసీ ఏర్పాటు!
కాప్రా: కాప్రా సర్కిల్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ శ్రీ భావన ఋషి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, భావన నగర్ నివాసుల హక్కులు, పారదర్శకత, ఐక్యత మరియు కాలనీ అభివృద్ధి లక్ష్యంగా ‘శ్రీ భావన ఋషి నివాసుల హక్కుల పరిరక్షణ సంయుక్త కార్యాచరణ కమిటీ’ (JAC) ఆధ్వర్యంలో తొలి బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను, సమస్యలను తెలియజేశారు. వ్యక్తిగత వ్యతిరేకత కాకుండా నివాసుల హక్కులను ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పరిరక్షించడమే తమ ప్రధాన ధ్యేయమని నిర్వాహకులు స్పష్టం చేశారు.
సభ్యత్వాలు, రికార్డుల్లో స్పష్టతకు డిమాండ్
అర్హులైన నివాసులకు సొసైటీ బైలాస్ ప్రకారం పారదర్శకంగా హౌసింగ్ సొసైటీ సభ్యత్వం కల్పించాలని సమావేశం కోరింది. శ్రీ మార్కండేయ స్వామి ఆలయ సభ్యత్వం, దాతల భాగస్వామ్యం, కాలనీ అధికారిక పేరు, సొసైటీ రికార్డులు, వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సీనియర్ సిటిజన్స్ కార్యాలయ స్థలాల వినియోగ హక్కులపై స్పష్టమైన పత్రాలు అందుబాటులో ఉంచాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. బెటర్మెంట్ ఛార్జీల చెల్లింపుల్లోనూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
JAC అడ్-హాక్ కన్వీనర్‌గా వీరారెడ్డి ఎంపిక
కాలనీలోని ప్రతి కుటుంబానికి సమాన గౌరవం, భాగస్వామ్యం ఉండాలని, పరస్పర మర్యాదతో కూడిన వాతావరణాన్ని పెంపొందించుకోవాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా JAC అడ్-హాక్ కన్వీనర్‌గా వీరారెడ్డికి సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు. నవీన్ గౌడ్, సుధాకర్, కిషోర్ రెడ్డి, వేణుగోపాల్, సదానంద గౌడ్, మురారి తదితర కాలనీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలు అందించారు. అందరికీ సమాన హక్కులు, పారదర్శకతే ధ్యేయంగా ముందుకుసాగుతామని సభ్యులు వెల్లడించారు.




