Hyderabad: బండి సంజయ్ వ్యాఖ్యలపై బీసీ-ఏ సమితి తీవ్ర ఆగ్రహం
Hyderabad: ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏలో చేర్చాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండించింది.
Hyderabad: బండి సంజయ్ వ్యాఖ్యలపై బీసీ-ఏ సమితి తీవ్ర ఆగ్రహం
Hyderabad: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని చేసిన వ్యాఖ్యలపై బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.భాగయ్య, అధ్యక్షుడు గడప శ్రీహరి, ప్రధానకార్యదర్శి టి. నారాయణలు మాట్లాడుతూ, ఎంబీసీ (అత్యంత వెనుకబడిన) కులాల హక్కులను విస్మరిస్తూ కొద్ది కులాలకే ప్రాధాన్యం కల్పించేలా మాట్లాడడం అనుచితమని వారు విమర్శించారు.
బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పుట్టుక నుంచి చావు వరకు సమాజానికి సేవలందించే చేతివృత్తులు, యాచక వృత్తులపై ఆధారపడిన 36కు పైగా బీసీ-ఏ ఉపకులాల హక్కులను నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలగించబడిన 27 కులాల హక్కుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపరంగా పోరాడి వాటిని సాధించుకున్నామని, ఇప్పుడు అధికార అహంకారంతో బీసీ కులాల మధ్య విభజన సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతూ, ఇప్పటికే కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.




