Amangal: పోలీస్ స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం.. 102 యూనిట్ల సేకరణ!

Amangal: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఆమనగల్లు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 102 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమరవీరులకు అధికారులు నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Oct 2026 7:03 AM IST
Amangal
X

Amangal: పోలీస్ స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం.. 102 యూనిట్ల సేకరణ!

Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రాణాలను కాపాడటంలో భాగస్వాములు కావడమే లక్ష్యంగా ఆమనగల్లు పోలీస్ శాఖ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

పోలీస్ ఫ్లాగ్ డే వీక్–2026, అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో యువత, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 102 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు తరలించారు.

రక్తదానంతో మరొకరి జీవితానికి వెలుగు:-ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి, మహేశ్వరం డివిజన్ ఏసీపీ జానకిరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ వెనుకబడిన తరగతుల మాజీ సభ్యులు తల్లోజు ఆచారి,ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, కడ్తాల్ ఎస్‌హెచ్‌ఓ సైది రెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుడికి ఘన నివాళి::-

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఆమనగల్లు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన స్వర్గీయ హనుమంత్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి::-

ఈ సందర్భంగా మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మహిళల భద్రతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, అవసరంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రక్తదాతలకు ప్రశంసాపత్రాలు::-

శిబిరంలో రక్తదానం చేసిన వారిని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక్కొక్కరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సంతోష్ రెడ్డి, శేఖర్, పోలీసు అధికారులు, సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువత, ఏబీవీపీ విద్యార్థులు, వైద్యులు, ఆమనగల్, కడ్తాల్, వెల్దండ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY