Amanagallu: ఆమనగల్‌లో దేవాలయాల చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో దేవాలయాల చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ. 1.65 లక్షల సొత్తు స్వాధీనం.
Amanagallu: ఆమనగల్‌లో దేవాలయాల చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం దేవాలయాల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులను చోరీ చేస్తున్న నిందితుడిని ఆమనగల్లు పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ విభాగం సహకారంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి వద్ద నుంచి మొత్తం రూ.1.65 లక్షల విలువైన చోరీ సొత్తుతో పాటు మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని విట్టాయిపల్లి గ్రామ శివారులో పెంట తండా గేట్ సమీపంలోని హనుమాన్ దేవాలయం, పక్కనే ఉన్న పెద్దమ్మ దేవాలయంలో చోరీ జరిగినట్లు పూజారి సభావత్ లక్ష్మణ స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 29న రాత్రి ఆలయాలకు తాళాలు వేసి వెళ్లిన అనంతరం, మరుసటి రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఆలయాల్లోని విలువైన వస్తువులను అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అక్టోబర్ 1న సాంకేతిక ఆధారాలను విశ్లేషించి పెద్దముక్కల ఈశ్వర్ (38) ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విట్టాయిపల్లి శివారులోని హనుమాన్, పెద్దమ్మ దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా పెదకొత్తపల్లి, పానగల్లు, గంటరావుపల్లి, కందుకూరు ప్రాంతాల్లోని దేవాలయాల్లోనూ వెండి, ఇత్తడి వస్తువులు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
వెండి మీసాలు, వెండి నోరు, వెండి కండ్లు, రెండు ఇత్తడి దీపాలు, ఆరు ఇత్తడి గంటలు, రెండు ఇత్తడి మంగళహారతులు, ఒక ఇత్తడి శఠగోపం, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా కడ్తాల్ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి బంగారు పూత వస్తువు, రాగి చెంబు, రాగి సరువు, ఇత్తడి గంట, రెండు రాగి బిందెలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.1,65,000గా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం రిమాండ్‌కు తరలించారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, ఏసీపీ ఎస్. జానకి రెడ్డి మార్గదర్శకత్వంలో ఆమనగల్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. ఏఎస్ఐ రామ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు శివకుమార్, మల్లయ్య తదితరులు దర్యాప్తులో పాల్గొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. వారికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.




