Amanagallu: ఆమనగల్లులో వీధి కుక్కల బెడదకు శాస్త్రీయ పరిష్కారం
Amanagallu: ఆమనగల్లు మున్సిపాలిటీలో వీధి కుక్కల నివారణకు బ్లూక్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలిరోజు 50 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు.
Amanagallu: ఆమనగల్లులో వీధి కుక్కల బెడదకు శాస్త్రీయ పరిష్కారం
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో వీధి కుక్కల సంతతిని నియంత్రించడంతో పాటు రేబిస్ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన బ్లూక్రాస్ సొసైటీతో మున్సిపాలిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర జంతు సంక్షేమ మండలి నిబంధనలు, జంతు జనన నియంత్రణ నిబంధనలు–2023 ప్రకారం యానిమల్ బర్త్ కంట్రోల్–యాంటీ రేబిస్ (ఏబీసీ–ఏఆర్) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.తొలిరోజు 5, 6, 12వ వార్డుల పరిధిలో 50 వీధి కుక్కలను పట్టుకుని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కేంద్రానికి తరలించారు.రాబోయే రోజుల్లో పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
వీధి కుక్కల జనాభాను శాస్త్రీయ పద్ధతిలో నియంత్రించడం, కుక్కల దాడులు, కాట్లను తగ్గించడం, రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును నివారించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. శస్త్రచికిత్సల అనంతరం కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు అందించనున్నారు. అదేవిధంగా పాఠశాలలు, వార్డుల్లో కుక్కల కాటు నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై బ్లూక్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పట్టణ ప్రజల భద్రతతో పాటు జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లూక్రాస్ ప్రతినిధి కుమారి, కౌన్సిలర్లు ఎం. వెంకయ్య, ఎన్. జగన్, మేనేజర్ ఆంజనేయులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్, సిబ్బంది రామకృష్ణ, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.




