Amanagallu: ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితులకే కేటాయించాలి
Amanagallu: ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను దళితులకు కేటాయించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన. పదవులు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక.
Amanagallu: ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితులకే కేటాయించాలి
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవులను కూడా దళితులకు కేటాయించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దళిత సీనియర్ నాయకులు జంతుక జానయ్య, వసపుల సాయిలు పులి కంటి మైసయ్య మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రవర్ణ నాయకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు. అగ్రవర్ణాలకు సంబంధించిన సమస్యలు, పంచాయతీల పరిష్కారంలో దళితులను ముందుంచుకుంటున్న నాయకులు, పదవుల కేటాయింపు విషయానికి వచ్చేసరికి మాత్రం వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆమనగల్ మార్కెట్ కమిటీ వంటి నామినేటెడ్ పదవుల్లోనైనా దళితులకు అవకాశం కల్పించాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవులను కూడా దళిత నాయకులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దళితులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకుండా వారి ఆత్మగౌరవం, రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి పదవులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో దళిత సంఘాలన్నీ ఐక్యంగా ఏర్పడి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మల్లెపువ్వు మల్లేష్, డొక్కా పురుషోత్తం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పసుపుల సురేష్, కంబాలపల్లి అల్లాజీ, జంతుక శ్రీశైలం, వస్పుల లక్ష్మణ్, వస్తువుల భరత్, మీసాల శంకరయ్య, గుడ్ల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.




