Amanagallu: దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి ఆమనగల్లు సీఐ
Amanagallu: దీపావళి పటాకుల విక్రేతలతో ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు అవగాహన సమావేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలని హెచ్చరిక, ఫైర్ సేఫ్టీ పాటించాలని ఆదేశం.
Amanagallu: దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి ఆమనగల్లు సీఐ
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా విక్రయాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఆమన్గల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు ఆమన్గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వెంకటేశ్వర్లు స్థానిక బాణసంచా దుకాణాల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగ సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన ప్రదేశాల్లో లైసెన్స్ కలిగిన దుకాణాలను మాత్రమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి బాణసంచా దుకాణం వద్ద నీటి బకెట్లు, ఇసుక, అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
విద్యుత్ వైరింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దుకాణాల వద్ద ధూమపానం నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేని, ప్రమాదకరమైన బాణసంచాను విక్రయించకూడదని హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలంతా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకునేలా వ్యాపారులు పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు కోరారు.




