Uppal: ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
Uppal: దీపావళి బాణసంచా దుకాణాల అనుమతుల పేరిట లంచాల వసూళ్లపై ఉప్పల్ భగాయత్‌లోని ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్‌లో రంగారెడ్డి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Uppal: ఎల్బీనగర్ ఫైర్‌స్టేషన్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
ఉప్పల్: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతుల కోసం వచ్చే యజమానుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ భగాయత్‌లోని ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్‌లో ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. బాణసంచా దుకాణాల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో రూ.500 మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ఒక్కో దుకాణం నుంచి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, డీజీ, జేడీ అనుమతితో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రాథమిక తనిఖీల్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శీనయ్య వద్ద రూ.10,500, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ వద్ద రూ.10 వేలు, ఫైర్ ఫైటర్ల వద్ద కలిపి మొత్తం రూ.30 వేల నగదును గుర్తించినట్లు వెల్లడించారు. బాణసంచా దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.
నలుగురి ఖాతాల్లోకి ఈ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఒకరి ఖాతాలో 53, మరొకరి ఖాతాలో 20, ఇంకొకరి ఖాతాలో 15 లావాదేవీలు ఉన్నట్లు తెలిపారు. గత నాలుగైదు రోజుల్లో సుమారు 90 మందితో ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు వివరించారు. గత వారం, పది రోజుల వ్యవధిలో బాణసంచా దుకాణాల అనుమతుల కోసం సుమారు 397 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో కొన్ని దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయని వారి నుండి లావాదేవీలు జరిగాయని మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడానికి గల కారణాలు, డబ్బుల కోసం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారా అనే అంశాలపై కూడా విచారణ జరుపుతామన్నారు. లావాదేవీలు జరిపిన దరఖాస్తుదారులను సైతం విచారిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.




