Hayathnagar: ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు: నలుగురు అరెస్ట్!
Hayathnagar: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Hayathnagar: ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు: నలుగురు అరెస్ట్!
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు చెందిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టురట్టయింది. నిందితుల నుంచి ఏకంగా రూ.6,78,00,000 విలువైన రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మడుపోజు కర్ణాకర్ (A1), చిన్నోళ్ల మాణిక్య రెడ్డి (A2), చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి (A3), కరణం అజయ్ కుమార్ (A4)లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు జల్లి వెంకటేష్, కుంజా బలరాజు, కంపసటి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో డిజైర్ కారులో ప్రయాణిస్తున్న నిందితులను పోలీసులు వాహన తనిఖీల సందర్భంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుంట్లూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోల ఆధారంగా ఫొటోషాప్ ద్వారా నకిలీ రూ.500 నోట్లను తయారు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా, ఫేక్ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టళ్లు, వాకీటాకీలను ఉపయోగిస్తూ తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడి, అసలు నగదును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించిన ఘటనాస్థలం, అద్దె ఇంటి నుంచి కలర్ ప్రింటర్లు, స్కానర్, ల్యామినేషన్ మెషిన్, ల్యాప్‌టాప్, ఫేక్ నంబర్ ప్లేట్లు, కటింగ్ మెషిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడటంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.




