Hyderabad: సివిల్స్ ఇంటర్వ్యూకు 31 మంది.. సింగరేణి మరో రూ.లక్ష సాయం
Hyderabad: సివిల్స్ ఇంటర్వ్యూకు తెలంగాణ నుంచి 31 మంది ఎంపికయ్యారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద వీరికి సింగరేణి మరో రూ.లక్ష చొప్పున అందించనుంది.
Hyderabad: సివిల్స్ ఇంటర్వ్యూకు 31 మంది.. సింగరేణి మరో రూ.లక్ష సాయం
హైదరాబాద్: తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం మరోసారి సత్ఫలితాలను అందించింది. తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన 31 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరోసారి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది.
సివిల్స్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రెండు నెలల క్రితం సింగరేణి సంస్థ 158 మందిని అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఈ మొత్తాన్ని నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ ఆర్థిక చేయూతతో మెయిన్స్‌కు సిద్ధమైన వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించడం పథకం విజయానికి నిదర్శనంగా నిలిచింది.
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందికి కూడా మరో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనుండగా, వాటికి కూడా సింగరేణి సంస్థ సహకారం అందించనుంది.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తుది ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. యువత సివిల్ సర్వీసెస్‌లో మరింతగా రాణించేలా సంస్థ తనవంతు సహకారం కొనసాగిస్తుందని తెలిపారు.
కాగా, ఈ ఏడాది ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో వరంగల్ నుంచి ఆరుగురు, మేడ్చల్–మల్కాజిగిరి నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల నుంచి ముగ్గురేసి ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరేసి, ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపికయ్యారు. వీరిలో 18 మంది ఓబీసీ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, ఎనిమిది మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు.
గత రెండేళ్లలో ఈ పథకం ద్వారా ఇప్పటికే 27 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం విశేషం. తెలంగాణ యువతకు ఆర్థిక చేయూతనిస్తూ వారి సివిల్స్ కలను సాకారం చేసేందుకు సింగరేణి చేపడుతున్న కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు..




