Soybean Prices Rising: పత్తికి పోటీగా సోయాబీన్ ధరలు.. క్వింటాల్‌కు రూ.10 వేల మార్క్‌పై రైతుల ఆశలు!
Soybean Prices Rising: అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ కారణంగా సోయాబీన్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
Soybean Prices Rising: ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తగ్గిన దిగుబడులతో రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ, మార్కెట్‌లో పంటలకు పెరుగుతున్న ధరలు కొంత ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంటకు దీటుగా సోయాబీన్ ధరలు సైతం దూసుకెళ్తుండటం రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో సోయా ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరగడంతో దేశీయ మార్కెట్లలోనూ ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం సోయాబీన్ క్వింటాల్‌కు రూ.8,000 నుంచి రూ.8,100 వరకు ధర పలుకుతోంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని హింగన్‌ఘాట్, లాతూర్ మార్కెట్లలో సోయాబీన్ ధరలు క్వింటాల్‌కు సుమారు రూ.8,500 వరకు నమోదవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగి క్వింటాల్ రూ.10 వేల మార్కును చేరుకునే అవకాశం ఉందని ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పత్తికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 మద్దతు ధర ప్రకటించగా, మార్కెట్‌లో డిమాండ్ కారణంగా రూ.9,000కు పైగా ధరలు పలుకుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్) ప్రకృతి వైపరీత్యాలు, పెట్టుబడి ఖర్చులు, తెగుళ్ల వల్ల పత్తి సాగులో తరచుగా నష్టాలు ఎదురవుతుండటంతో రైతులు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో సుమారు 100 రోజుల్లోనే పంట చేతికి రావడం, అనుకూల పరిస్థితుల్లో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సోయా విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, పంట కోత సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల దిగుబడులు తగ్గి, చేతికందే దశలో సోయా గింజలు నల్లబడటంతో రైతులకు కొంత నష్టం వాటిల్లింది. అప్పట్లోనే పంటను విక్రయించిన రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా, ప్రస్తుతం పంటను నిల్వ ఉంచుకున్న రైతులు మాత్రం పెరుగుతున్న ధరలతో లాభాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. తమకు బీమా, సబ్సిడీ సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.




