Land Resurvey: రీసర్వేతో మళ్లీ రైతుల తలరాతలు మారతాయా?.. చిన్న రైతులు నష్టపోకుండా ఏం చేయాలి?
Land Resurvey: భూముల రీసర్వే ప్రక్రియతో రైతులు ఎదుర్కొంటున్న కొత్త సమస్యలు, చారిత్రక నేపథ్యం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
Land Resurvey: రీసర్వేతో మళ్లీ రైతుల తలరాతలు మారతాయా?.. చిన్న రైతులు నష్టపోకుండా ఏం చేయాలి?
Land Resurvey: మానవుడు సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి మారిన నాటి నుంచే భూమిపై హక్కుల కోసం సరిహద్దులు గీసుకోవడం ప్రారంభమైంది. రాచరిక కాలంలో పన్నుల కోసం, ఆధునిక కాలంలో కాగితాల ఆధారంగా భూ హక్కులను నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రస్తుత కాలంలో చేపడుతున్న భూముల రీసర్వే (Land Resurvey) ప్రక్రియ రైతన్నలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోందని ఫార్మర్స్ కమిషన్ ప్రతినిధి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. హెచ్ఎంటీవీ అగ్రికల్చర్ (hmtvagri) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన భూ సర్వేకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు.
సర్వే అంటేనే సమస్యల తేనెగూడు కదపడమే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం వేలాది గ్రామాల్లో భూముల రీసర్వే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే, చరిత్రను పరిశీలిస్తే 1880, 1910 మరియు 1940 ప్రాంతాల్లో జరిగిన సర్వేల సమయంలోనూ సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని సునీల్ కుమార్ గుర్తుచేశారు. సర్వే చేయడం అంటే సమస్యల తేనెగూడు కదిలించడంతో సమానమని, ఈ ప్రక్రియలో ఎప్పుడూ కూడా బలహీనులు, చిన్న రైతులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్న రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
భూముల రీసర్వే వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రధానంగా మూడు కీలక సూత్రాలను పాటించాలని ఆయన సూచించారు.
ప్రజల భాగస్వామ్యం: సర్వే ప్రారంభమైన మొదటి రోజు నుంచి రికార్డులు ఫైనల్ అయ్యే వరకు గ్రామ ప్రజలను, భూ యజమానులను ప్రతి దశలోనూ భాగస్వాములను చేయాలి. వారి నుంచి ఎప్పటికప్పుడు సమ్మతి సంతకాలు తీసుకోవడం ద్వారా వివాదాలను తగ్గించవచ్చు.
భూమి వాస్తవ పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలి: పాత కాగితాలను పట్టుకుని వచ్చి నేరుగా కొలతలు వేయడం కంటే, ప్రస్తుతం వాస్తవంగా ఏ రైతు ఆధీనంలో ఎంత భూమి ఉందో పరిశీలించి ఆ ప్రకారం రికార్డులను సరిచేసే కార్యక్రమం ఉండాలి. లేకపోతే పాత రికార్డులకు, ప్రస్తుత భూమికి తేడా వచ్చి వివాదాలు తలెత్తుతాయి.
తక్షణ పరిష్కార యంత్రాంగం: వైద్యుడు ఆపరేషన్ చేయడానికి ముందు అన్ని రకాల సరంజామా, ఆక్సిజన్ ఎలా సిద్ధం చేసుకుంటారో.. అదే విధంగా సర్వే చేసే ముందే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగానికి శిక్షణనిచ్చి సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
సమగ్ర సన్నద్ధత లేకుండా చేపట్టే రీసర్వే వల్ల రైతుల తలరాతలు తారుమారయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.




