ఎల్‌నినో ఎఫెక్ట్.. పౌల్ట్రీ రంగం గట్టెక్కేదెలా? ఉదయ్ సింగ్ బయాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ!

El Nino Effect on Poultry Industry: ఎల్‌నినో ప్రభావం మరియు దానా ధరల పెరుగుదలతో పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాజ్ మాట్లాడారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 5:31 PM IST
ఎల్‌నినో ఎఫెక్ట్.. పౌల్ట్రీ రంగం గట్టెక్కేదెలా? ఉదయ్ సింగ్ బయాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ!
X

ఎల్‌నినో ఎఫెక్ట్.. పౌల్ట్రీ రంగం గట్టెక్కేదెలా? ఉదయ్ సింగ్ బయాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ!

El Nino Effect on Poultry Industry: దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కీలకమైన పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న దానా ధరలు, ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడం మరియు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాజ్ కోరారు. hmtv అగ్రికల్చర్ 'నేలతల్లి' ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.

కోళ్ల పెంపకంలో అత్యంత కీలకమైన సోయాబీన్, మొక్కజొన్న ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఉదయ్ సింగ్ తెలిపారు. మరోవైపు ఎథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్నను పెద్దఎత్తున డైవర్ట్ చేస్తుండటం వల్ల పౌల్ట్రీ రంగానికి మేత కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా రా మెటీరియల్ లభ్యత తగ్గి బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేర్‌హౌస్‌లలో అక్రమంగా నిల్వ చేసిన మేత స్టాక్‌ను బయటకు తెప్పించేలా మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేలా ప్రభుత్వం ఒక ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఫార్మర్లకు సబ్సిడీపై దానా అందించాలని, విద్యుత్ రాయితీలు కల్పించాలని కోరారు.

ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దేశంలో ప్రోటీన్ అవగాహన పెరగడంతో పౌల్ట్రీ వినియోగం పెరుగుతోందని ఉదయ్ సింగ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీని రైతులకు పరిచయం చేసేందుకు హైదరాబాద్‌లో 'పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో'ను నిర్వహిస్తున్నట్లు వెరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేటిక్ నిపుల్ వాటర్ సిస్టమ్స్ వంటి ఆధునిక పద్ధతులను రైతులు అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో చికెన్, ఎగ్స్పై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఆరోగ్యానికి కోడిగుడ్డు, చికెన్ అత్యంత శ్రేష్టమైన ప్రోటీన్ మూలాలని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.