Donkey Milk Business: లీటర్ గాడిద పాల ధర రూ.7,000.. కిలో పాల పౌడర్ రూ.80 వేలు! ఇదో కొత్త బిజినెస్ ఐడియా

Donkey Milk Business: సాధారణంగా ఆవు లేదా గేదె పాలు లీటర్ రూ.50 నుంచి రూ.100 మధ్య లభిస్తాయి. కానీ, లీటర్ పాల ధర ఏకంగా రూ.7,000 పలుకుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు.

Arun Chilukuri
Published on: 23 Nov 2026 11:50 AM IST
Donkey Milk Business
X

Donkey Milk Business: లీటర్ గాడిద పాల ధర రూ.7,000.. కిలో పాల పౌడర్ రూ.80 వేలు! ఇదో కొత్త బిజినెస్ ఐడియా

Donkey Milk Business: సాధారణంగా ఆవు లేదా గేదె పాలు లీటర్ రూ.50 నుంచి రూ.100 మధ్య లభిస్తాయి. కానీ, లీటర్ పాల ధర ఏకంగా రూ.7,000 పలుకుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 'గాడిద పాల'కు ఇంతటి భారీ డిమాండ్ ఉంది. ఈ వినూత్న వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ హిమాచల్ ప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఒక గాడిదల ఫామ్ ప్రారంభమైంది.

12 గాడిదలతో మొదలైన వినూత్న ప్రాజెక్ట్

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా, కందరోర్ గ్రామంలో ‘డయారికా ఫామ్స్’ సంస్థ రాష్ట్రంలోనే తొలి గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేసింది. వ్యాపారవేత్త సంజీవ్ సింగ్ ఠాకూర్ 12 గాడిదలతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. డైరీ కన్‌క్లేవ్ 2026 సందర్భంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ ధర్మానీ ఈ ఫామ్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో గాడిదల సంఖ్యను 25కు పెంచడంతో పాటు, స్థానిక రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ఫామ్ పనిచేస్తోంది.

కాస్మెటిక్స్, హెల్త్ ప్రొడక్ట్స్‌లో భారీ డిమాండ్

గాడిద పాలకు ఉన్న ఔషధ, సౌందర్య పోషక గుణాల వల్ల వీటి ధర ఆకాశాన్నంటుతోంది.

పాల ధర: లీటర్ గాడిద పాలను రూ.5,000 నుంచి రూ.7,000 వరకు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మిల్క్ పౌడర్ ధర: ఈ పాలతో తయారుచేసే పౌడర్ నాణ్యతను బట్టి కిలో రూ.20,000 నుంచి రూ.80,000 వరకు ధర పలుకుతుందని అంచనా.

స్కిన్‌కేర్, బ్యూటీ, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు తయారుచేసే దేశ, విదేశీ కంపెనీలకు ఈ పాలను సరఫరా చేయనున్నారు.

అంతరించిపోతున్న ‘స్పిటి’ జాతి పరిరక్షణ

భారత్‌లో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటాన్ని గమనించి ఈ వ్యాపార ఆలోచనకు రూపకల్పన చేసినట్లు డయారికా ఫామ్స్ సహ వ్యవస్థాపకురాలు సీరత్ టూర్ వెల్లడించారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అరుదైన ‘స్పిటి’ (Spiti) జాతి గాడిదల పెంపకంపై వీరు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ సంస్థ సొంత ఫామ్, స్థానిక పశుపోషకుల సహకారంతో రోజుకు 2,700 లీటర్లకు పైగా వివిధ రకాల పాలను సేకరించి విక్రయిస్తోంది.

ఫామ్ ఏర్పాటుకు రూ.50 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ

సాంప్రదాయ పాడి పరిశ్రమతో పాటు గాడిదలు, ఒంటెలు, గుర్రాలు, గొర్రెల పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జాతీయ పశుసంవర్ధక మిషన్ కింద అర్హులైన వారికి ఫామ్ ఏర్పాటు కోసం గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు సబ్సిడీ అందుతోంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.2,672.65 కోట్ల విలువైన 3,843 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేవలం బరువులు మోయడానికే పరిమితమైన గాడిదలు, ఇప్పుడు రైతులకు కాసుల వర్షం కురిపించే సరికొత్త వ్యాపార వనరుగా మారుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.