Health: బీపీ, షుగర్ టాబ్లెట్స్ విరిచి వేసుకుంటున్నారా.? జర జాగ్రత్త.! ఈ విషయాలు గుర్తించుకోండి

Health: అన్ని టాబ్లెట్లనూ విరిచి మింగడం సురక్షితం కాదని, మాత్రపై గీత ఉందని దాన్ని సగం చేయకూడదని, SR, ER, XR, CR, XL, MR ఉన్న స్లో-రిలీజ్ మాత్రలు విరిస్తే BP, షుగర్ పడిపోవచ్చని, EC మాత్రలు విరిస్తే కడుపులో మంట కలగొచ్చని డాక్టర్ మీర్ హెచ్చరించారు.

Ravi
By Ravi
Published on: 21 Nov 2026 5:09 PM IST
Health
X

Health: బీపీ, షుగర్ టాబ్లెట్స్ విరిచి వేసుకుంటున్నారా.? జర జాగ్రత్త.! ఈ విషయాలు గుర్తించుకోండి

Health: అన్ని టాబ్లెట్లనూ విరిచి మింగడం సురక్షితం కాదని డాక్టర్ మీర్ హెచ్చరించారు. మాత్రపై గీత ఉందని దాన్ని సగం చేయకూడదని, వైద్యుడు సూచిస్తేనే విరవాలని తెలిపారు. 'SR, ER, XR, CR, XL, MR ఉన్న స్లో-రిలీజ్ మాత్రలు విరిస్తే రోజంతా అందాల్సిన మోతాదు ఒక్కసారిగా రక్తంలో కలిసి BP, షుగర్ పడిపోవొచ్చు. EC మాత్రలు విరిస్తే కడుపులో మంట కలగొచ్చు. మింగడానికి ఇబ్బందిగా ఉంటే చిన్న టాబ్లెట్/ సిరప్ వాడండి' అని సూచించారు.

స్లో-రిలీజ్ మాత్రలను ప్రత్యేక పూతతో లేదా మ్యాట్రిక్స్‌తో తయారు చేస్తారు. దీనివల్ల మందు 12 నుంచి 24 గంటల పాటు కొద్దికొద్దిగా రక్తంలోకి విడుదలవుతుంది. ఈ మాత్రను విరగ్గొట్టినా, నలిపినా, నమిలినా ఆ రక్షణ పోయి, ఒక రోజు మొత్తం డోసు ఒక్కసారిగా శరీరంలోకి చేరుతుంది. దీన్ని 'డోస్ డంపింగ్' అంటారు. ఫలితంగా మందు స్థాయి అకస్మాత్తుగా పెరిగి దుష్ప్రభావాల ముప్పు పెరుగుతుంది.

ఉదాహరణకు షుగర్‌కు వాడే మెట్‌ఫార్మిన్ ఎక్స్‌టెండెడ్ రిలీజ్ మాత్రను నమిలితే లేదా విరిస్తే రక్తంలో గ్లూకోజ్ ప్రమాదకరంగా తగ్గే అవకాశం ఉందని ఔషధ సంస్థల సూచనలు చెబుతున్నాయి. 'గ్లూకోట్రాల్ ఎక్స్ఎల్' వంటి మాత్రలను మింగాలి, నమలకూడదు, విరవకూడదు అని ఆ సంస్థ స్పష్టంగా పేర్కొంది. బీపీ మందుల్లో కూడా ఇలాంటి స్లో-రిలీజ్ రకాలు ఉంటాయి.

ఎంటెరిక్-కోటెడ్ మాత్రలకు కడుపులోని ఆమ్లం నుంచి మందును లేదా కడుపును కాపాడే పూత ఉంటుంది. అందువల్ల మాత్ర కడుపులో కరగకుండా చిన్న పేగులో కరిగేలా చేస్తారు. ఈ పూతను పగలగొడితే మందు కడుపులోనే కరిగి, కడుపులో మంట, చికాకు కలగవచ్చు. లేదా ఆమ్లంతో మందు విచ్ఛిన్నమై పనిచేయకపోవచ్చు.

మాత్రపై గీత ఉందంటే విరవొచ్చనేది కూడా అపోహ. కొన్ని మాత్రలపై ఉన్న గీత కేవలం డిజైన్ మాత్రమే. 'స్కోర్ లైన్ ఉన్నంత మాత్రాన విరవడం సురక్షితమని కాదు' అని ఔషధ సమాచార సంస్థలు చెబుతున్నాయి. గీత ఉన్న సాధారణ ఇమ్మీడియట్-రిలీజ్ మాత్రను మాత్రమే, వైద్యుడు లేదా ఫార్మసిస్ట్ సురక్షితమని చెబితేనే విరవాలి. మాత్ర పరిమాణం వల్ల మింగడం కష్టమైతే వేరే రూపంలో (చిన్న మాత్ర, సిరప్) ఇవ్వమని డాక్టర్‌ను అడగాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.