Health: పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌స్తుందా.? విన‌డానికి వింత‌గా ఉన్నా..

Health: బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలామందికి మహిళలే గుర్తుకొస్తారు. కానీ పురుషుల్లోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నప్పటికీ,

Mokshith
Updated on: 18 Oct 2026 5:46 PM IST
Health
X

Health: పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌స్తుందా.? విన‌డానికి వింత‌గా ఉన్నా..

Health: బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలామందికి మహిళలే గుర్తుకొస్తారు. కానీ పురుషుల్లోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నప్పటికీ, దీని గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. ప్రారంభ లక్షణాలను గుర్తించి, సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే వ్యాధిని గుర్తించేందుకు, తగిన చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది.

పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే

పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఛాతీ భాగంలో, చనుమొన దగ్గర గట్టిగా గడ్డ ఏర్పడటం ప్రధాన లక్షణాల్లో ఒకటి. అయితే గడ్డ ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ ఉందని భావించకూడదు. ఇతర లక్షణాలను కూడా గమనించాలి. వాటిలో ప్ర‌ధాన‌మైన‌వి.. చనుమొన దగ్గర గట్టిగా గడ్డ ఏర్పడటం, చనుమొన లోపలికి ముడుచుకుపోవడం, ఛాతీ చర్మం ఎర్రబడటం లేదా పొలుసుల్లా మారడం, చనుమొన నుంచి ద్రవం రావడం, ముఖ్యంగా రక్తం కనిపించడం, చంకలో వాపు లేదా గడ్డ ఏర్పడటం, ఛాతీ భాగంలో ఆకస్మిక మార్పులు కనిపించడం. అయితే.. ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే క్యాన్సర్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. అయితే అసలు కారణం తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించడం మంచిది.

ఛాతీలో గడ్డ ఉందంటే క్యాన్సరేనా?

పురుషుల్లో ఛాతీ భాగంలో గడ్డ ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో గైనెకోమాస్టియా (Gynecomastia) ఒకటి. ఈ సమస్యలో హార్మోన్ల మార్పుల కారణంగా పురుషుల ఛాతీలోని గ్రంథి కణజాలం పెరుగుతుంది. దీంతో చనుమొన చుట్టూ వాపు లేదా గడ్డ ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే గైనెకోమాస్టియా, బ్రెస్ట్ క్యాన్సర్ రెండింటినీ లక్షణాలను బట్టి మాత్రమే స్పష్టంగా గుర్తించడం సాధ్యం కాదు. వైద్యులు అవసరాన్ని బట్టి శారీరక పరీక్షలు, అల్ట్రాసౌండ్ లేదా మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయవచ్చు. అనుమానం ఉంటే బయాప్సీ ద్వారా గడ్డలోని కణజాలాన్ని పరిశీలిస్తారు. ముఖ్యంగా కొత్తగా గడ్డ ఏర్పడినా, అది పెరుగుతున్నా, చనుమొన నుంచి రక్తం వచ్చినా లేదా చర్మంలో మార్పులు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

పురుషులు ఈ లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు?

పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అరుదుగా వస్తుందనే భావన వల్ల చాలామంది ఈ వ్యాధి తమకు రాదని అనుకుంటారు. దీంతో ఛాతీలో గడ్డ ఏర్పడినా పెద్దగా పట్టించుకోరు. మరికొందరు హార్మోన్ల మార్పుల వల్లే ఇలా జరుగుతోందని భావించి వైద్య పరీక్షలు చేయించుకోరు. ఇంకొందరికి ఛాతీ సమస్య గురించి ఇతరులతో చెప్పడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. వైద్యులను సంప్రదించడానికి కూడా సంకోచిస్తారు. గడ్డ దానంతట అదే తగ్గిపోతుందని భావిస్తూ రోజులు, నెలలు గడిపేస్తారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల వ్యాధి గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. అందుకే ఛాతీలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే సిగ్గు, భయం పక్కన పెట్టి వైద్యులను సంప్రదించాలి. ప్రారంభంలోనే సమస్యను గుర్తిస్తే చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.

సకాలంలో పరీక్షలు చేయించుకుంటే ప్రయోజనం ఏంటి?

పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇచ్చే చికిత్స వ్యాధి ఏ దశలో ఉంది, క్యాన్సర్ కణాల స్వభావం ఎలా ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ వంటి చికిత్సలను వైద్యులు సూచించవచ్చు.

పురుషుల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌లో కొన్ని రకాలు హార్మోన్ రిసెప్టర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్మోన్ థెరపీ కూడా చికిత్సలో భాగం కావచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. క్యాన్సర్ రకం, దశ, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.