Bapatla: తాగునీటి సరఫరాలో జాప్యంపై అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన రైతులు

Bapatla: చీరాల నియోజకవర్గం తోటవారిపాలెం పంపింగ్ స్కీం పెండింగ్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి తాగునీరు విడుదల చేయాలని వైఎస్సార్‌‌సీపీ నాయకులు కోరారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 4 Oct 2026 11:13 AM IST
Bapatla
X

Bapatla: తాగునీటి సరఫరాలో జాప్యంపై అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన రైతులు

Bapatla: తోటవారిపాలెం పంపింగ్ స్కీం ద్వారా తాగునీటిని వెంటనే విడుదల చేసేందుకు పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు అధికారులను కోరారు. చీరాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం సువార్తపురం ఛానల్ జేఈ నాగవనజను కలిసి సమస్యను వివరించారు.

గతంలో తోటవారిపాలెం పంపింగ్ స్కీం ద్వారా తాగునీటిని విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో జేఈ నాగవనజ ఆహ్వానం మేరకు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాన్ని రైతులతో కలిసి పరిశీలించారు.

పంపింగ్ స్కీం పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపించారు. అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మరో రెండు, మూడు రోజుల్లో పైభాగం నుంచి తాగునీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. అయితే పంపింగ్ స్కీం మరమ్మతులు పూర్తికాకపోతే నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పనులను వెంటనే పూర్తి చేసి తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని కోరుతూ జేఈ నాగవనజకు వినతిపత్రం అందజేశారు. జేఈ సానుకూలంగా స్పందించి సంబంధిత అంశంపై అండర్‌టేకింగ్ లెటర్ అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరు రమణారెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు దేవసహాయం, వెంకట్రావు తదితరులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala