Mangalagiri: మంగళగిరిలో విమెన్ ఏపీఎల్ ప్రారంభం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Mangalagiri: మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (విమెన్ ఏపీఎల్) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి టాస్ వేశారు.
Mangalagiri: మంగళగిరిలో విమెన్ ఏపీఎల్ ప్రారంభం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Mangalagiri: మంగళగిరిలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (విమెన్ ఏపీఎల్) టీ20 క్రికెట్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... మహిళా క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేపట్టిన విమెన్ ఏపీఎల్ అభినందనీయమన్నారు. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ టోర్నీని రూపకల్పన చేశారని, క్రీడాకారిణులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు.
టోర్నీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రేక్షకులకు అద్భుతమైన క్రీడానుభూతిని అందించేలా అన్ని మ్యాచ్‌లను డే అండ్ నైట్ విధానంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారని చెప్పారు.
మహిళలను క్రీడల్లో మరింతగా ప్రోత్సహించడం, మహిళా సాధికారతను బలోపేతం చేయడమే విమెన్ ఏపీఎల్ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న మహిళా క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్రానికి, దేశానికి మంచి క్రీడాకారిణులను అందించడంలో ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
అలాగే మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన సహకారంతో స్టేడియం ఆధునికీకరణ, ఫ్లడ్‌లైట్లు, ప్రేక్షకుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యాయని, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నీల నిర్వహణకు మంగళగిరి ప్రధాన వేదికగా ఎదుగుతోందన్నారు.




