Bapatla: చీరాలలో వార్డుల పునర్విభజనపై పునఃపరిశీలన చేయాలి మెరిగ పేరయ్య!
Bapatla: చీరాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన, ఓటర్ల విభజనలో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ అభ్యర్థి వినతి పత్రం అందజేత.
Bapatla: చీరాలలో వార్డుల పునర్విభజనపై పునఃపరిశీలన చేయాలి మెరిగ పేరయ్య!
Bapatla: చీరాల మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన వార్డుల పునర్విభజన, ఓటర్ల విభజనపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అయోమయాలను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని చీరాల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి మెరిగ పేరయ్య (ఇస్సాక్) మున్సిపల్ కమిషనర్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు.
గతంలో ఉన్న 33 మున్సిపల్ వార్డులను 44 వార్డులుగా పునర్విభజించిన నేపథ్యంలో వార్డుల సరిహద్దులు, ఓటర్ల కేటాయింపులో మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యుల ఓట్లు సైతం వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
గతంలో తమ ఓటు ఏ వార్డులో, ఏ పోలింగ్ కేంద్రంలో ఉండేదో తెలిసినప్పటికీ, ప్రస్తుతం కొత్త వార్డు, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా 8వ వార్డుకు సంబంధించిన సుమారు 160 ఓట్లు 3వ వార్డు, 9వ వార్డులతో కలిసినట్లు, ఆయా వార్డుల నుంచి కొన్ని ఓట్లు తిరిగి 8వ వార్డులోకి వచ్చినట్లు ఆయన వినతిలో పేర్కొన్నారు.
ఈ మార్పులపై ప్రజల్లో స్పష్టత అవసరమని కోరారు. వార్డుల సరిహద్దులను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని, ఓటర్ల జాబితాలను ఇంటింటి, ప్రాంతాల వారీగా పరిశీలించి తప్పులను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రాంతం లేదా కుటుంబానికి చెందిన ఓటర్లను సాధ్యమైనంత వరకు ఒకే వార్డులో ఉంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు తగిన అవకాశం కల్పించాలని, ప్రతి ఓటరుకు తన ఓటు ఏ వార్డులో, ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. తుది ఓటర్ల జాబితా, వార్డుల సరిహద్దులు, పోలింగ్ కేంద్రాల వివరాలను పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చోట పునఃపరిశీలన చేపట్టాలని మెరిగ పేరయ్య (ఇస్సాక్) కోరారు.




