Vinukonda: రూ.35 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం - చీఫ్ విప్ జీవీ

Vinukonda: వినుకొండలో రూ.35 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. పురపాలక సంఘానికి రూ.25 కోట్లు మంజూరైనట్లు వెల్లడి.

KAREEMULLA, VINUKONDA
Published on: 21 Sept 2026 8:55 PM IST
Vinukonda
X

Vinukonda: రూ.35 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం - చీఫ్ విప్ జీవీ

వినుకొండ: వినుకొండ పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్‌లో అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. సుమారు రూ.35 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.

అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.5,500 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ఇందులో భాగంగా వినుకొండ పురపాలక సంఘానికి సుమారు రూ.25 కోట్ల నిధులు మంజూరైనట్లు జీవి పేర్కొన్నారు. ఈ నిధులతో పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వినుకొండ పట్టణంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలను పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని జీవి తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA