Vinukonda: వినుకొండలో రూ.65 లక్షల పనులకు చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన

Vinukonda: వినుకొండ పట్టణంలో రూ.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, స్వాగత తోరణాల నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 26 Sept 2026 2:59 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో రూ.65 లక్షల పనులకు చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన

వినుకొండ: వినుకొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.65 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్డు పనులకు ఎమ్మెల్యే జీవీ భూమిపూజ చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మూడు స్వాగత తోరణాల నిర్మాణంలో భాగంగా లయోలా స్కూల్‌ వద్ద మొదటి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పట్టణానికి వచ్చే ప్రజలకు స్వాగతం పలికేలా ఈ తోరణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.వినుకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA