Vinukonda: బీసీలకు 34% రిజర్వేషన్లపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: బీసీలకు 34% రిజర్వేషన్ల సాధన కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
Vinukonda: బీసీలకు 34% రిజర్వేషన్లపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గే పరిస్థితి ఏర్పడిందని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. బీసీలపై నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అప్పటి ప్రభుత్వం వారి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం గట్టిగా న్యాయపోరాటం చేసేదని వ్యాఖ్యానించారు. బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని తిరిగి కల్పించేందుకు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వైసీపీ పాలనలో బీసీ వర్గాలకు చెందిన పలువురిపై దాడులు, వేధింపులు జరిగాయని జీవీ ఆరోపించారు. చంద్రయ్య తదితర ఘటనలను ప్రస్తావిస్తూ, బీసీలపై దాడులు, హత్యలు జరిగినా అప్పటి ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని విమర్శించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి అదే వర్గానికి అన్యాయం చేశారని జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు.
బీసీల రక్షణ, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని జీవీ తెలిపారు. బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలతో సహా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. నాడు, నేడు, భవిష్యత్తులోనూ బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.




