Mangalagiri: వక్ఫ్ ఆస్తులు పేదల సంక్షేమానికే: అబ్దుల్ అజీజ్
Mangalagiri: వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో పేదల సంక్షేమం, ఆడబిడ్డల ఉచిత వివాహాలు జరిపిస్తామని మంగళగిరిలో రూ.2 కోట్ల వాణిజ్య సముదాయ శంకుస్థాపనలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
Mangalagiri: వక్ఫ్ ఆస్తులు పేదల సంక్షేమానికే: అబ్దుల్ అజీజ్
Mangalagiri: వక్ఫ్ ఆస్తులు ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, వాటిని పరిరక్షించి ఆదాయాన్ని పెంచడం ద్వారా పేదల విద్య, వివాహాలు, ఉపాధి, సంక్షేమానికి వినియోగించాలని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్‌లో అంజుమన్-ఎ-హిమాయతుల్ ఇస్లాం, ఇస్లామిక్ ఫ్రంట్ ప్రెసిడెంట్ అక్రమ్ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన G+3 వాణిజ్య సముదాయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, వక్ఫ్ బోర్డ్ సభ్యులు అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఖాజా లతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. 1955 నుంచి అంజుమన్ సంస్థను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఆస్తులను పరిరక్షించిన గత, ప్రస్తుత కమిటీ సభ్యులను అభినందించారు.
రహదారి విస్తరణలో పాత దుకాణాలు తొలగిపోవడంతో మంత్రి నారా లోకేష్ సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో 9 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఆధునిక వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ సముదాయం ద్వారా వచ్చే ఆదాయంతో తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డలకు పూర్తిగా ఉచితంగా వివాహాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంస్థ పరిధిలోని రెండు కమ్యూనిటీ హాళ్లను ఆధునికీకరించడంతో పాటు ఐదు మసీదుల్లో ఏసీ సహా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
మహిళలకు కుట్టు శిక్షణ, ఉర్దూ అకాడమీ సహకారంతో బాలబాలికలకు కంప్యూటర్, ఏఐ, ఉర్దూ శిక్షణ అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. వక్ఫ్ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడం, అక్రమంగా విక్రయించడం సహించబోమని హెచ్చరించారు.
సమాజ సేవ కోసం అంకితమైన వక్ఫ్ ఆస్తులను కాపాడి, వాటి ఆదాయంతో పేదలను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తోందన్నారు.
మంగళగిరి అభివృద్ధిలో లోకేష్ ప్రత్యేక ముద్ర
మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అబ్దుల్ అజీజ్ ప్రశంసించారు. భారీ మెజారిటీతో లోకేష్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రూ.2 వేల కోట్లతో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం స్మార్ట్ సిటీ దిశగా కీలక ముందడుగన్నారు.
వరద ముంపు నివారణకు రూ.294 కోట్లతో చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. దశాబ్దాలుగా నివాస స్థలాలపై హక్కులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న 6 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.
అలాగే 20కి పైగా కమ్యూనిటీ హాళ్లు, ఆధునిక పార్కుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు. విద్యారంగంలోనూ మంగళగిరి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
నిడమానూరులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసిన పాఠశాల స్ఫూర్తితో నెల్లూరులో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రూ.20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎస్సీ బాలికల వసతి గృహాల ఆధునికీకరణకు మంగళగిరిలో చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారని తెలిపారు.
మంగళగిరి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపిన అబ్దుల్ అజీజ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపైనా ఇదే తరహాలో దృష్టి సారించాలని కోరారు.




